Sunday, 19 March 2017

ఏటీఎం సెంటెర్స్ లో జరిగే మోసాలు ....తీసుకోవాల్సిన జాగ్రత్తలు...!


ఏటీఏం కార్డు లేని వారు నేడు చాలా అరుదు. వాడకం విస్తృతంగా పెరిగిపోవడంతో మోసగాళ్లు ఏటీఎం కేంద్రాలను అడ్డాగా చేసుకుంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో అజాగ్రత్తగా ఉంటే బ్యాంకు ఖాతాలో నగదు చోరుల చేతిలో పడినట్టే. కనుక తస్మాత్ జాగ్రత్త. 
ఏటీఎం కేంద్రంలోకి అడుగుపెడుతున్న దగ్గర నుంచి తిరిగి బయటకు వచ్చే వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఏ రూపంలో నయినా మోసం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా జరుగుతుందా..? అనే రీతిలో మోసానికి గురి కావచ్చు. అందుకే ఏటీఎం మోసాలపై అవగాహన పెంచుకుని అప్రమత్తతతో వ్యవహరించాలి.

ఇలా జరుగుతాయి...

* ఏటీఎం మెషిన్ లో కార్డును ఇన్ సర్ట్ చేసే స్థలానికి కొంచెం పైన మోసగాళ్లు రహస్య కెమెరా అమర్చుతారు. కార్డులోని మేగ్నటిక్ స్ట్రిప్ ను రీడ్ చేసే పరికరాన్ని కూడా అక్కడ ఉంచుతారు. కార్డును ఇన్ సర్ట్ చేసి, పిన్ ఎంటర్ చేయడాన్ని ఈ కెమెరా రహస్యంగా చిత్రీకరిస్తుంది. కార్డు వివరాలు నేరగాళ్ల చేతికి చేరిపోతాయి. ఈ వివరాలతో వారు డూప్లికేట్ కార్డును ఇన్ సర్ట్ చేసి నగదును విత్ డ్రా చేసుకుంటారు. 
* మరో తీరులో కేటుగాళ్లు ఏటీఎం కేంద్రం వద్ద మాటు వేస్తారు. కార్డు స్లాట్ వద్ద గుర్తించలేని విధంగా ఇమిడిపోయే పరికరాన్ని అమరుస్తారు. ఒక్కసారి కార్డును ఇన్ సర్ట్ చేసి ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత... కార్డు బయటకు రాకుండా అది అడ్డుకుంటుంది. ఒకటి రెండు నిమిషాలు ప్రయత్నించి వెళ్లిపోతారు. ఆ తర్వాత అక్కడే ఉంచిన పరికరాన్ని తొలగించి లోపలున్న కార్డును పొందడం ద్వారా నగదును కొల్లగొడతారు. సాధారణంగా ఇలాంటి మోసాలు బ్యాంకులు పనిచేయని వేళ్లలో జరుగుతాయి. ఎందుకంటే ఫిర్యాదు ఇవ్వడానికి వెంటనే బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉండరు. దాంతో నేరగాళ్లు తమ పని సులభంగా పూర్తి చేసుకుని వెళతారు. 
* అలాగే, ఏటీఎం యంత్రం నుంచి నగదు బయటకు వచ్చే మార్గంలో ఓ పరికరాన్ని అమరుస్తారు. దాంతో నగదు బయటకు రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఏటీఎం పనిచేయడం లేదని భావించి వెళ్లిపోతారు. ఆ తర్వాత అక్కడ ఆగిపోయిన నగదును మోసగాళ్లు తీసేసుకుంటారు. 
* కొన్ని ఏటీఎం మెషిన్లు నగదును బయటకు పంపేందుకు సమయం తీసుకుంటాయి. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత నగదు కౌంటింగ్ కూడా వెంటనే ప్రారంభం కాదు. చాలా నిదానంగా కొన్ని సెకన్ల తర్వాత మెషిన్ స్పందిస్తుంది. దీంతో ఏటీఎం మెషిన్లలో తిష్టవేసిన వ్యక్తి మెషిన్ సరిగా పని చేయడం లేదని మాయమాటలు చెబుతాడు. ఆ మాటలు నమ్మి క్యాన్సిల్ బటన్ నొక్కకుండా బయటకు వెళ్లామా... మెషిన్ నుంచి వచ్చే నగదు అతడి చేతిలో పడినట్టే.

ఒక ఉదాహరణ

చండీగఢ్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రంలో ఓ మహిళ తన డెబిట్ కార్డును ఇన్ సర్ట్ చేసి పిన్ టైప్ చేసి కావాల్సిన నగదు మొత్తాన్ని ఎంటర్ చేసింది. తర్వాత ఓకే బటన్ ను ప్రెస్ చేయగా అది పని చేయలేదు. దాంతో నగదు బయటకు రాలేదు. అక్కడే ఉన్న ఓ యువకుడు జోక్యం చేసుకుని అకౌంట్ బ్యాలన్స్ బటన్ ను ఓకే చేశాడు. జోక్యం చేసుకోవద్దని అతడ్ని హెచ్చరించిన ఆమె మరోసారి తన కార్డును ఎంటర్ చేసి నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా మళ్లీ అదే పరిస్థితి. ఒకటికి నాలుగు సార్లు ఎంటర్ కీ నొక్కడంతో స్క్రీన్ నల్లగా మారిపోయింది. కొంత సేపు వేచి చూసినా అలానే ఉండడంతో ఆమె క్యాన్సిల్ బటన్ నొక్కగా... ఇన్ సర్ట్ యువర్ ఏటీఎం కార్డ్ అన్న మెసేజ్ రావడంతో బయటకు వెళ్లిపోయింది. 
దగ్గర్లోని ఎస్ బీఐ ఏటీఎం సెంటర్ కు వెళ్లి ఆమె రూ.2వేలు డ్రా చేసుకుంది. కానీ బ్యాలన్స్ చూస్తే మొత్తం 17వేలు విత్ డ్రా చేసినట్టు కనిపించింది. సెల్ ఫోన్ చూసుకుంటే రూ.15వేలు, రూ.2వేల మేర రెండు లావాదేవీలు జరిగినట్టు ఎస్ఎంఎస్ లు కనిపించాయి. ఇది ఎలా జరిగిందన్నది ఆమెకు అంతుబట్టలేదు. బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో వాళ్లు నమోదు చేసుకున్నారు. ఏటీఎం ఎర్రర్, నగదు ఆటోమేటిక్ గా ఖాతాకు జమ అవుతాయని బదులిచ్చారు. ఏడు రోజులు ఆగమన్నారు. కానీ నగదు రాలేదు. మళ్లీ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయగా... కార్డును బ్లాక్ చేసుకుని, మోసం జరిగినట్టు ఫిర్యాదు ఇవ్వమన్నారు. ఆ తర్వాత బ్యాంకు సైబర్ క్రైమ్ పర్యవేక్షక బృందం విచారణ చేపడుతుందని సెలవిచ్చారు. ఆమె సందేహంతో బ్యాంకుకు వెళ్లి విచారించింది. 
కార్డు బ్లాక్ చేసుకోవద్దని బ్యాంకు సిబ్బంది సలహా ఇచ్చారు. ‘fraud occurred due to malfunctioning of pnb atm machine’ అని మెయిల్ పెట్టమన్నారు. ఆమె అలానే చేసింది. దీంతో పీఎన్ బీ ఐటీ విభాగం స్పందించింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జరిగింది నిజంగా మోసమేనని జవాబిచ్చింది. వీడియో ఫుటేజీల కోసం వెండర్ ను కోరినట్టు తెలిపింది. కానీ, తప్పిదం జరిగిన రోజున బ్యాంకు ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజీ అందుబాటులో లేదని తర్వాత మరో సమాధానం వచ్చింది. 
దీంతో గత్యంతరం లేక ఆమె బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించింది. అప్పుడు బ్యాంకు దారికి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీ బ్యాంకు శాఖలో అందుబాటులో ఉందని దాన్ని పరిశీలించాలని కోరింది. ఆ తర్వాత తాము చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చింది. కానీ, ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మరోవైపు ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఏటీఎం మెషిన్ ను హ్యాంగ్ చేసి నగదును కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

ఇదో నయా మోసం

2014లో కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం మెషిన్లలో డబ్బులు నింపే సీఎంఎస్ ఏజెన్సీ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడ్డారు. నాలుగు నెలల కాలంలో రూ.66.58 లక్షలను కొల్లగొట్టారు. ఏటీఎం యంత్రంలో కార్డును ఇన్ సర్ట్ చేసి అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత లోపల్నుంచి నగదు బయటకు వస్తుందని తెలుసు కదా. కానీ, వీరు నగదు బయటకు రాకుండా చేయి అడ్డు పెట్టారు. దీంతో అది వెనక్కి వెళ్లిపోయి తిరిగి ఖాతాలో జమైంది. అడ్డు పెట్టిన చేయి తీసిన వెంటనే అంతకుముందు నమోదు చేసిన లావాదేవీ తాలూకు నగదు మొత్తం బయటకు వచ్చే లోపాన్ని వారు తమ మోసానికి అవకాశంగా మార్చుకున్నారు. ఫలితంగా బ్యాంకు ఖాతాల్లో నగదు బ్యాలన్స్ నుంచి కొట్టేయకుండా, బ్యాంకు సొమ్మును కాజేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది.

జాగ్రత్తలతో భద్రం

* స్క్రీన్ లాక్ లేదా హ్యాంగ్ అయిన సందర్భాల్లో వెంటనే సెక్యూరిటీ గార్డును పిలిచి సాయం కోరాలి. అనుమానితులున్నట్టు చెప్పాలి. 
* లావాదేవీ నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను అనుమతించవద్దు. 
* సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాలను వాడుకోవద్దు. రాత్రి సమయాల్లో, బ్యాంకులు పనిచేయని వేళ్లల్లో అత్యవసరమైతే తప్ప ఏటీఎంలను వాడవద్దు. జన సమ్మర్థ ప్రాంతాల్లోని ఏటీఎంలను వినియోగించడం భద్రత రీత్యా నయం. 
* కొంత మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా 500 రూపాయల చొప్పున ఏటీఎంలలో డ్రా చేస్తుంటారు. వీలయితే తరచూ లావాదేవీలను తగ్గించడం నయం. 
* కార్డు కోల్పోతే వెంటనే బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి బ్లాక్ చేయించుకోవాలి. కార్డు మెషిన్ లోపల ఇరుక్కుపోతే కస్టమర్ కేర్ నంబర్ కు అక్కడి నుంచే కాల్ చేయండి. తరచూ పిన్ నంబర్ కూడా మార్చుకోవాలి. 
* పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో మరో చేయిని అడ్డంగా పెట్టుకోవాలి. బ్యాంకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ మెసేజ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవడం నయం. 
* కార్డును ఇన్ సర్ట్ చేసే ముందు అక్కడ ఏదైనా అనవసరపు పరికరాలను అమర్చారా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. 
* కార్డు స్లాట్ వద్ద అనుమానిత వస్తువు ఏదైనా కనిపిస్తే వెంటనే బ్యాంకు సిబ్బందికి తెలియజేయాలి. 
* ఏటీఎం కార్డు వెనుక సీవీవీ అని మూడు అంకెలు ఉంటాయి. దాన్ని గుర్తు పెట్టుకుని కార్డుపై చెరిపేయండి. కార్డు వెనుక భాగంలో సిగ్నేచర్ కాలమ్ వద్ద తప్పకుండా సంతకం చేయాలి.

బ్యాంకులదే బాధ్యత

ఏటీఎం మెషిన్ ను ఏర్పాటు చేసింది బ్యాంకే. కనుక మోసాలు, అక్రమాలు జరగకుండా నివారణ, భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది. లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో వేరెవరూ లోపలికి చొరబడకుండా బ్యాంకులే తగిన ఏర్పాట్లు చేయాలి. ఇలా బ్యాంకులవైపు ఉన్న లోపాలకు కస్టమర్లు ఎందుకు నష్టపోవాలి. అందుకే ఏ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో తప్పిదం జరిగిందన్న దానితో సంబంధం లేకుండా కస్టమర్ తనకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకు టోల్ ఫ్రీ, కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులు స్పందించకుంటే వివిధ మార్గాల్లో (అంబుడ్స్ మెన్, వినియోగదారుల ఫోరం, న్యాయస్థానం) న్యాయ సహాయం పొందవచ్చు.

HEALTH TIPS: BEST HOME REMEDIES FOR CRACKED HEELS

శీతాకాలం... వేసవి కాలం.. కొందరిని వర్షాకాలంలోనూ కాలి పగుళ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. స్త్రీలకు అందమైన పాదాలు ఓ పెద్ద అసెట్ అని తెలిసిందే కదా.. చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు... మరికొందరు వైద్యుల సలహాతో వివిధ రకాల మందులు వాడినా ఆశించిన ఫలితం లేక విసుగు చెందిన వారూ ఉంటారు. అలాంటి వారికి నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను గురించి తెలుసుకుందాం. 
తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానుతుండడం, మురికికి ఎక్కువగా ఎక్స్ పోజ్ కావడం కాలి పగుళ్ల సమస్యకు ప్రధాన కారణాలు. అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్ కూడా దారి తీయవచ్చు. 

* కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఓ రూపునిస్తుంది. మైనం ఆవనూనె తో కలిపి రాత్రి పూట పగుళ్లపై రాసి చూడండి. తెల్లవారే సరికి మార్పును గమనిస్తారు. 
* గ్లిజరిన్, రోజ్ వాటర్ తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాసి చూడండి. 
* నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట. నిద్రించే ముందు పాదాలకు మర్ధన చేయాలి. 
* అరటి పండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది. 
* పసుపు, తులసి , కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలోవెరా జెల్ కలిపి రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు.

Saturday, 18 March 2017

విటమిన్లలో రకాలు మరియు ఆరోగ్యకర జీవితానికి వాటి ఆవశ్యకత.

మనం ఏదైనా పనిచేయాలంటే శక్తి అవసరం. ఆహారం జీర్ణమై గ్లూకోజ్ గా మారి దాని నుంచి మనకు శక్తి అందుతుంది. కానీ శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా సాగాలంటే కేవలం శక్తి సరిపోదు దానికి మరెన్నో ముఖ్యమైన పదార్థాలు కావాలి. వాటిలో అతి ముఖ్యమైనవి విటమిన్లు. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారానే మనకు విటమిన్లు అందుతాయి. అలా అందే విటమిన్లు సరిపోని పక్షంలోగానీ, అత్యవసర పరిస్థితుల్లోగానీ విటమిన్లను మాత్రల రూపంలో శరీరానికి అందించవచ్చు. కానీ ఇలా మాత్రల రూపంలో అందించడంపై శాస్త్రవేత్తలు, వైద్యుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతేగాకుండా కొన్ని విటమిన్లను నిర్ణీత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మోతాదు ఎక్కువైన పక్షంలో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అందువల్ల కచ్చితంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ మాత్రలను తీసుకోవాలి. అసలు ఈ విటమిన్లు ఏమిటి, అవి లోపిస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు, విటమిన్లు ఎక్కువగా లభించే ఆహారం ఏమిటో తెలుసుకుందాం..

విటమిన్లలో ఏడు రకాలు

ఏ, బీ, సీ, డీ, ఇ, కె రకాలుగా విటమిన్లు ఉంటాయి. వీటిని రెండు విధాలుగా వర్గీకరిస్తారు. నీటిలో కరగనివి ఏ, డీ, ఈ, కె విటమిన్లు.. ఇవి కొవ్వు పదార్థాలలో కరుగుతాయి. బీ, సీ విటమిన్లు నీటిలో కరుగుతాయి. నీటిలో కరగని విటమిన్లు మన శరీరానికి స్వల్ప మోతాదుల్లో అవసరం. కానీ అత్యావశ్యకం. ఇవి కొన్ని రకాల ఆహార పదార్థాల్లోనే లభిస్థాయి. అదే నీటిలో కరిగే విటమిన్లు మనకు చాలా రకాల ఆహార పదార్థాల్లో ఉంటాయి. కానీ మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇవి కూడా లోపిస్తున్నాయి. ఏ, డి, ఇ, కె విటమిన్లు ఆహార పదార్థాలను వేడి చేసినా దెబ్బతినవు. కానీ బీ, సి విటమిన్లు మాత్రం ఓ స్థాయికి మించి ఆహార పదార్థాలను వేడిచేస్తే నశించిపోతాయి. అందువల్ల విస్తృతంగా లభించినా కూడా బి, సి విటమిన్ల లోపాలు ఏర్పడుతుంటాయి.

మంచి కంటి చూపునకు.. విటమిన్ ఏ

మంచి కంటి చూపు, నిగనిగలాడే చర్మం, కండరాల పటుత్వానికి విటమిన్ ఏ తోడ్పడుతుంది. శరీరంలో ఫ్రీర్యాడికల్స్ ను నియంత్రించే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పిల్లల్లో మంచి ఎదుగుదలకు తోడ్పడుతుంది. శరీరంలో కణాలు దెబ్బతినడాన్ని నిరోధిస్తుంది. రక్తనాళాలు, వివిధ అవయవాలపై పొరల్లో ఉండే కణజాలం రక్షణకు తోడ్పడుతుంది. దంతాలు, రోగ నిరోధక వ్యవస్థ, వివిధ అవయవాలను ఆవరించి ఉండే మ్యూకస్ పొరలు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ ఏ లో 80 నుంచి 90 శాతం కాలేయంలోనే నిల్వ ఉంటుంది. 
విటమిన్ ఏ పనితీరుపై అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రొవిడెన్స్ సెయింట్ జాన్స్ హెల్త్ సెంటర్ వైద్య శాస్త్రవేత్త షెర్రీ రాస్ పరిశోధన చేశారు. శరీరంలో కణాల విభజన, పెరుగుదలతోపాటు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి విటమిన్ ఏ తోడ్పడుతుందని చెప్పారు. ఇది పెద్దవారిలో పురుషులకు రోజుకు 900 మైక్రోగ్రాములు, మహిళలకు 700 మైక్రోగ్రాములు అవసరం. వరిలో విటమిన్ ఏ అతి తక్కువగా ఉంటుంది. అందువల్ల వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే మన దేశంతోపాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాల వారిలో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) గణాంకాల ప్రకారం విటమిన్ ఏ లోపం కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది చిన్నారులు అంధత్వం బారిన పడుతున్నారు. చూపు కోల్పోయిన 12 నెలల్లోపే వారిలో సగం మంది వరకూ మరణిస్తున్నారు. రక్తంలోని సీరంలో ఉండే రెటినాల్ స్థాయులను పరీక్షించడం ద్వారా విటమిన్ ఏ లోపాన్ని గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తుల రక్తంలో 28 నుంచి 86 మైక్రోగ్రాములు విటమిన్ ఏ ఉండాలి. 28 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉంటే లోపమున్నట్లే. అయితే ఈ లోపాన్ని గుర్తించేనాటికి చాలా ముందు నుంచే విటమిన్ ఏ శరీరానికి అందడం లేదని లెక్క. ఎందుకంటే ఎక్కువగా తీసుకునే విటమిన్ ఏ పెద్ద మొత్తంలో కాలేయంలో నిల్వ అవుతూ.. అవసరమైనప్పడు విడుదలవుతూ ఉంటుంది. లోపం ఏర్పడేనాటికి కాలేయంలోనూ విటమిన్ ఏ నిల్వ శూన్యమవుతుంది. ఇక కంటి చూపు దెబ్బతిన్నప్పుడు ‘రాడ్ స్కోటోమెట్రీ, ఎలక్ట్రోరెటీనోగ్రఫీ’ పరీక్షల ద్వారా అది విటమిన్ ఏ లోపం కారణంగానా? లేక మరేదైనా కారణంగానా? అనేది గుర్తిస్తారు.

లోపిస్తే ఎన్నో సమస్యలు

విటమిన్ ఏ లోపం చాలా వరకు పోషకాహార లోపం కారణంగానే ఏర్పడుతుంది. ముఖ్యంగా బియ్యాన్ని వినియోగించే అన్నం, రొట్టెలను ప్రధాన ఆహారంగా తీసుకునే ప్రాంతాల్లో ఈ లోపం ఎక్కువ. దీంతోపాటు కొవ్వులు వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసుకోవడంలో లోపం, కాలేయ సంబంధిత వ్యాధులతోనూ విటమిన్ ఏ లోపం ఏర్పడుతుంది. కంటిలోని రెటీనాలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఏర్పడడానికి రెటినాల్ అత్యవసరం. ఇది లోపిస్తే దృష్టి మందగిస్తుంది. రేచీకటి వస్తుంది. కన్నీరు ఉత్పత్తి కాకపోవడంతో పొడి కళ్ల సమస్య వస్తుంది. రంగులను గుర్తించే శక్తి సన్నగిల్లుతుంది. చివరికి పూర్తిగా కళ్లు కనబడని పరిస్థితి కూడా రావొచ్చు. 
ఇక దీని లోపం కారణంగా చర్మం సున్నితత్వాన్ని కోల్పోయి గరుకుగా మారుతుంది. ప్రత్యుత్పత్తి చర్యలపైనా ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే మ్యూకస్ పొర దెబ్బతిని.. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ ఏ ను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే దీని మోతాదు మించితే ఏర్పడే దుష్పరిణామాలు చాలా ప్రమాదకరం. దీర్ఘకాలం పాటు ఎక్కువ మోతాదులో విటమిన్ ఏ ను తీసుకుంటే.. కాలేయం దెబ్బతింటుంది. చర్మం, నరాల సంబంధిత సమస్యలు, వెంట్రుకలు రాలిపోవడంతో పాటు ఎముకలు గుల్లబారిపోవడం వంటివి తలెత్తుతాయి.

పిల్లలకు అత్యవసరం..

ముఖ్యంగా చిన్న పిల్లల్లో విటమిన్ ఏ అవసరం చాలా ఎక్కువ. దీని లోపం వల్ల వారిలో ఎదుగుదల మందగిస్తుంది. దృష్టి లోపం సమస్యలు తలెత్తుతాయి. లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే కార్నియా మెత్తగా మారి పగిలిపోతుంది. దాని కారణంగా శాశ్వత అంధత్వం వస్తుంది. కంటిలో పువ్వు (తెల్లని చుక్కలు) ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్నారులు పలు రకాల ఇన్ఫెక్షన్లకు సులువుగా లోనవుతారు. ఇతరత్రా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే విటమిన్ ఏ లోపం వల్ల అవి మరింతగా పెరిగిపోతాయి. మీజిల్స్ (తట్టు) సంక్రమించిన పిల్లల్లో వ్యాధి లక్షణాలను తగ్గించడంలో విటమిన్ ఏ బాగా తోడ్పడుతుంది.

ఇవి తింటే చాలు..

విటమిన్ ఏలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి జంతు సంబంధ పదార్థాల్లో ఉండే రెటినాల్. రెండోది వృక్ష సంబంధమైన వాటిలో ఉండే బీటా కెరోటిన్. ఈ బీటా కెరోటిన్ మన కాలేయం, పేగుల్లో రెటినాల్ గా మారుతుంది. 
- రెటినాల్ ఎక్కువగా లభించే ఆహారం పాలు, గుడ్లు, మాంసం, వెన్న, కాలేయం, చేపనూనె, కిడ్నీలు. 
- బీటా కెరోటిన్ ఎక్కువగా ముదురు రంగులో, ఎక్కువ ప్రకాశవంతమైన రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. ఇంకా ఆకు కూరలు, ఆరెంజ్, క్యారెట్లు, చిలగడ దుంప, గుమ్మడి, బ్రాకొలి, ఆప్రికాట్, తృణధాన్యాలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ డి - ఎముకల దృఢత్వం కోసం..

దృఢమైన ఎముకలు, బలమైన కండరాలు, మంచి రోగ నిరోధక శక్తికి విటమిన్ డి అత్యవసరం. దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్. శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ఫాస్పేట్లు పేగుల నుంచి రక్తంలో కలిసేందుకు ఇది తోడ్పడుతుంది. ఎముకల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మితిమీరిన కణ విభజనను నియంత్రించి కేన్సర్ వచ్చే పరిస్థితిని నివారిస్తుంది. కండరాలు, నాడులు సరిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఎంతో కొంత విటమిన్ డి లోపం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సూర్యరశ్మి తగలకపోవడం, విటమిన్‌ డి లేని ఆహారం తీసుకోవడం, పారా థైరాయిడ్‌ గ్రంథి పనితీరు దెబ్బతినటం, లివర్‌ వ్యాధులు, కిడ్నీ జబ్బుల వంటి సందర్భాల్లో విటమిన్‌-డి లోపం తలెత్తుతుంది 
. ఊబకాయుల శరీరంలో విటమిన్ డి కొవ్వులోనే నిక్షిప్తమై ఉంటుంది. దాంతో వారిలో దీని లోపం కనిపిస్తుంది. 50 ఏళ్లలోపు వారికి రోజుకు 200 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్లు), 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారికి రోజుకు 400 ఐయూ, 70 ఏళ్లు పైబడిన వారికి 600 ఐయూ విటమిన్ డి అవసరం. ముఖ్యంగా రుతుక్రమం నిలిచిపోయిన మహిళలకు విటమిన్ డి అవసరం చాలా ఎక్కువ. మరోవైపు ఆహారం ద్వారా అందిన, సూర్యరశ్మితో చర్మం తయారు చేసిన విటమిన్ డి మొత్తాన్నీ శరీరం యథావిధిగా వినియోగించుకోలేదు. అందులో కొంత వృధాగా పోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజుకు 700 నుంచి 1,000 ఐయూ వరకూ విటమిన్ డి అందేలా చూసుకోవాలి. ఇక ఈ విటమిన్ లో మరిన్ని ఉప రకాలు ఉన్నా.. డీ2, డీ3లు మనకు అవసరం. బ్రెస్ట్, ప్రొస్టేట్ కేన్సర్లను, ల్యూకేమియా (రక్త కేన్సర్)ను నిరోధించడంలో విటమిన్ డి కీలకంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో ప్రాథమికంగా గుర్తించారు. కానీ పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు.

లోపిస్తే జీవితాంతం కష్టాలే..

మనం నిత్యం పనిచేసుకోవడానికి, కనీసం నిలబడడానికి ఎముకలు దృఢంగా ఉండడం అవసరం. విటమిన్ డి లోపిస్తే ఎముకలకు కాల్షియం అందక గుల్లబారిపోతాయి. దానివల్ల చిన్నపాటి ఒత్తిడికి గురయినా విరిగిపోతాయి. చిన్న పిల్లల్లో దొడ్డి కాళ్లు, ఛాతీ ఎముకలు ముందుకు వచ్చి పంజరంలా మారిపోయే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. 20 నుంచి 40 ఏళ్ల వయసువారిలో ఆస్టియో మలేసియా, నాడుల బలహీనత ఏర్పడుతుంది. పెద్ద వయసు వారు, వృద్ధుల్లో ఆస్టియో ఫ్లోరోసిస్, ఆస్టియో పీనియా, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక విటమిన్ డి లోపం వల్ల ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవడం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. 
రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్త రక్త కణాల్లో చురుకుదనం తగ్గిపోయి రకరకాల వ్యాధులు, రుగ్మతలు వెంటాడుతాయి. చిన్న పిల్లల్లో టైప్-1 మధుమేహం రావడానికి విటమిన్ డి లోపం కూడా కారణమని పరిశోధకులు గుర్తించారు. అంతేగాకుండా పలు రకాల కేన్సర్లు ముప్పు కూడా పెరుగుతుందని తమ అధ్యయనాల్లో తేల్చారు. ఏ వయసు వారిలోనైనా కండరాల్లో నొప్పులు, కండరాలు బలహీనం కావడం, కీళ్ల నొప్పులు విటమిన్ డి లోపానికి ప్రథమ సూచికలు. అలాగే తాజా పరిశోధనల్లో, విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ (కుంగుబాటు) అనే మానసిక వ్యాధికి కూడా గురవుతున్నట్టు వెల్లడైంది. ఆల్కలీన్ ఫాస్పటేజ్, పారాథార్మోన్, 25హైడ్రాక్సి కోలీ కాల్సిఫెరాల్ పరీక్షల ద్వారా విటమిన్ డి లోపాన్ని గుర్తించవచ్చు. ఎముకలు బలహీనం కావడాన్ని ఎక్స్ రేల ద్వారా గమనించవచ్చు.

వృద్ధులూ జాగ్రత్త..

పెద్ద వయసు వారిలో చర్మం ముడతలు పడి, గరుకుగా మారిపోయి ఉండడంతో.. వారిలో విటమిన్ డి తక్కువగా తయారవుతుంది. దానితోపాటు వయసుతో వచ్చే ఎముకలు గుల్లబారిపోవడం, కీళ్ల అరుగుదల వంటి సమస్యలూ ఎక్కువ. అందువల్ల 50 ఏళ్ల వయసుపైబడిన వారిలో విటమిన్ డి అవసరం చాలా ఎక్కువ. అంతేకాదు వారు విటమిన్ డి తోపాటు ఆహారంలో కాల్షియం, ఫాస్పరాస్ లు సరిపోయే మోతాదులో ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే చిన్నపాటి ఒత్తిడికే ఎముకలు విరిగిపోయి, వెన్నుపూస దెబ్బతిని జీవితం చివరి దశలో ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది.

కాస్త ఎండలో గడపండి

విటమిన్ డి దొరికే ఆహార పదార్థాలు అతి స్వల్పం. దీనిని పొందడానికి చేయాల్సిన ముఖ్యమైన పని ఎండలో నిలబడడమే. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మన చర్మం విటమిన్ డిని తయారుచేసుకుంటుంది. తెల్లగా ఉన్నవారికంటే కాస్త నలుపు చర్మం ఉన్నవారు ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే నలుపు రంగులో ఉన్న చర్మంలో మెలనిన్ సమర్థవంతంగా విటమిన్ డిని తయారుచేయలేదని పరిశోధనల్లో తేలింది. కాడ్ చేప నూనె, సాల్మన్ చేపలు, రొయ్యలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగులు, పోషకాలు కలిపిన తృణధాన్యాల్లో కొంత వరకు విటమిన్ డి లభిస్తుంది. ఇక విటమిన్ డి లోపాన్ని గుర్తించిన పక్షంలో కేవలం ఎండలో నిలబడడం, ఆహారం ద్వారా వెంటనే అందే అవకాశం తక్కువ. అందువల్ల వైద్యుల సలహా మేరకు విటమిన్ డి మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.

మోతాదు మించొద్దు

విటమిన్ డి ని అధిక మోతాదులో తీసుకుంటే చాలా దుష్పరిమాణాలు తలెత్తుతాయి. బరువు తగ్గిపోవడం, నీరసం, అతిగా మూత్రం రావడం, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రక్త నాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి. శరీరంలో కాల్షియం మోతాదు ఎక్కువైపోయి అది విషపూరితంగా (టాక్సిసిటీ) మారుతుంది. ముఖ్యంగా గర్భిణులు దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి మోతాదు మించితే గర్భంలోని శిశువుకు హాని కలుగుతుంది. అయితే సాధారణంగా ఎండలో నిలబడడం ద్వారాగానీ, ఆహారం నుంచి గానీ అత్యధిక స్థాయిలో విటమిన్ డి లభించే అవకాశం లేదు. కేవలం విటమిన్ డి మాత్రలు, ఇతర సప్లిమెంట్లలో భాగంగా అందినప్పుడే మోతాదు మించుతుంది. అందువల్ల వైద్యులు సూచించిన మోతాదులో మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్లను వినియోగించడం శ్రేయస్కరం.

అందానికి, ఆరోగ్యానికి.. విటమిన్ ఇ

మన అందానికి, ఆరోగ్యానికి, సంతానం పొందడానికి అత్యంత ముఖ్యమైనది విటమిన్ ఈ. దీనిని రసాయనికంగా ‘టోకోఫెరాల్’ అని పిలుస్తారు. దీనివల్ల శరీర పటుత్వం పెరుగుతుంది. మహిళల్లో ప్రత్యుత్పత్తి అవయవాలను రక్షించడంతోపాటు గర్భస్రావం కాకుండా నిరోధిస్తుంది. పురుషుల్లో శుక్రకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. దీనికి కొవ్వును కరిగించే శక్తి ఉంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరంలోని ఫ్రీర్యాడికల్స్ ను, కేన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచి అవసరమైన పరిస్థితుల్లో రక్తం సాఫీగా ప్రవహించడానికి సాయపడుతుంది. కంటి చూపు మెరుగుపడేందుకు, రక్త కణాల వృద్దికి తోడ్పడుతుంది. 
మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది. రుతుక్రమం సమయంలోనూ మహిళలు ఎదుర్కొనే పొత్తికడుపు నొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులను తగ్గిస్తుంది. ఊబకాయం సమస్యతో బాధపడుతున్నవారు విటమిన్ ఈ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. 14 ఏళ్లు పైబడినవారికి రోజుకు 15 మిల్లీగ్రాముల విటమిన్ ఈ అవసరం. అదే పిల్లలకు పాలిస్తున్న మహిళలు 19 మిల్లీగ్రాములు తీసుకోవాలి. అయితే విటమిన్ ఈ అధికంగా తీసుకుంటే పలు దుష్పరిణామాలు తలెత్తుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు 1,000 మిల్లీగ్రాములకు మించి దీనిని తీసుకోకూడదు.

లోపిస్తే సంతాన సమస్య

విటమిన్ ఇ లోపానికి గురికావడమనేది చాలా తక్కువ. ఇది మనం నిత్యం వినియోగించే చాలా రకాల ఆహారపదార్థాల్లో లభించడమే దీనికి కారణం. అయితే కొన్నేళ్లుగా మారిన జీవన విధానం కారణంగా శరీరానికి విటమిన్ ఇ అందకుండా పోతోంది. నూనెలను ఎక్కువగా వేడి చేయడంతో వాటిల్లోని విటమిన్ నశిస్తుంది. ఇక ఎక్కువగా వేపుళ్లు, జంక్ ఫుడ్ కు అలవాటు పడడం వంటివాటితో శరీరానికి అవసరమైన విటమిన్ ఇ అందడం లేదు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు విటమిన్ ఇ ఎంతో అవసరం. దీని లోపం వల్ల స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు సులువుగా ఇన్ఫెక్షన్లకు లోనవుతాయి. అండ వాహికలు మూసుకుపోతాయి. పురుషుల్లో వీర్యకణాల్లో చురుకుదనం లోపిస్తుంది. దీంతో సంతాన లేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
ఇక విటమిన్ ఇ లోపం వల్ల చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. రక్త హీనత, కండరాల బలహీనత, నీరసం, నరాల బలహీనత, మతి మరుపు, దృష్టి మందగించడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడం, నాడులు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉండి రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు విటమిన్ ఇ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు విటమిన్ ఇ లోపం గనుక ఉంటే కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.

అజీర్ణం సమస్య ఉంటే మరింత జాగ్రత్త

తిన్న ఆహారం సరిగా జీర్ణం కాని సమస్యతో బాధపడుతున్నవారిలో కచ్చితంగా విటమిన్ ఇ లోపం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు గ్యాస్, దీర్ఘ కాలిక మలబద్ధకంతో బాధపడుతున్నవారు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు తీసుకున్నవారిలో కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యే అవకాశం తక్కువ. దీంతో విటమిన్ ఇ లోపం ఏర్పడుతుంది. 30 ఏళ్లుపైబడిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

మీ పిల్లలను గమనించండి

మూడు నుంచి ఆరు నెలలోపు శిశువుల్లో కొంత మందికి విటమిన్ ఇ లోపం కనిపించే అవకాశం ఉంటుంది. ఆ శిశువులకు కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. ఈ స్థితిని ‘అబెటలిపొప్రొటీనిమియా’ అంటారు. విటమిన్ ఈ కొవ్వు పదార్థాలలో మాత్రమే కరుగుతుంది. దాని ద్వారానే శరీరానికి అందుతుంది. కొవ్వు పదార్థాలు జీర్ణం కానప్పుడు వాటిల్లో ఉండే విటమిన్ ఇ కూడా అందక లోపం ఏర్పడుతుంది. శిశువుల్లో చర్మం పొడిబారిపోతుండడం, తరచూ అనారోగ్యానికి గురవుతుండడం ద్వారా దీనిని గుర్తించవచ్చు. అలాంటి వారికి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో విటమిన్ ఈ తోపాటు తగిన చికిత్సను అందించాల్సి ఉంటుంది.

వీటిల్లో విటమిన్ ఇ

మనం తరచూ తీసుకునే ఆహార పదార్థాల నుంచే విటమిన్ 'ఇ'ని పొందవచ్చు. ముఖ్యంగా గోధుమ మొలకల్లో (వీట్ జర్మ్) ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక బాదం, వాల్ నట్స్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వులు, ఆలివ్ నూనెలు, మొక్కజొన్న, ఆకుకూరలు, తృణధాన్యాలు, చిలగడ దుంప, గుడ్లు, కాలేయంలలో లభిస్తుంది.

గాయాలు మాన్పే.. విటమిన్ కె

మనకు ఏదైనా గాయమైతే కొద్ది సేపటికే అక్కడ రక్తం గడ్డ కట్టి కారిపోవడం ఆగిపోతుంది. ఒకవేళ గడ్డకట్టకపోతే గాయం నుంచి రక్తం ధారాపాతంగా కారిపోయి.. తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఇలా రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే అత్యంత ముఖ్యమైన సూక్ష్మ పోషకం విటమిన్ కె. అందుకే దీనిని ‘బ్లడ్ క్లాటింగ్ విటమిన్’ అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. విటమిన్ కె1 ( ఫిలోక్వినోన్ ), విటమిన్ కె2 (మెనాక్వినోన్). ఎముకలు దృఢంగా ఉండడానికి విటమిన్ డి తోపాటు విటమిన్ కె కూడా అవసరం. కణజాలాల్లో అంతర్గత క్రియలకు కూడా ఇది తోడ్పడుతుంది. ఎ, డి విటమిన్ల తరహాలోనే ఇది కూడా కొవ్వుల ద్వారా అందే విటమిన్. 
సాధారణంగా మనకు అవసరమైన విటమిన్ కె లో చాలా వరకు మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారానే తయారవుతుంది. పెద్ద వయసు వారికి రోజుకు 70 నుంచి 90 మైక్రోగ్రాముల వరకు విటమిన్ కె అవసరం. అయితే ఆయా వ్యక్తుల వయసు, బరువు, ఇతర కారణాలను బట్టి ఈ మోతాదు మారుతుంది. అమెరికా నేషనల్ హెల్త్ లైబ్రరీ, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ల లెక్కల ప్రకారం వ్యక్తుల శరీర బరువు ఒక్కో కిలోకు ఒక మైక్రోగ్రాము చొప్పున విటమిన్ కె అవసరం. ఉదాహరణకు 72 కిలోల బరువున్న వ్యక్తికి 72 మైక్రోగ్రాముల విటమిన్ కె అవసరం. సాధారణంగా అధికంగా తీసుకున్న విటమిన్ కె శరీరంలో నిల్వ అవుతుంది. అందువల్ల దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదాలేమీ లేవు. కానీ గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలు ఉన్నవారు, రక్తాన్ని పలుచన చేసే మందులు వినియోగిస్తున్నవారు విటమిన్ కె విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లోపిస్తే ప్రమాదకరం.

సాధారణ వ్యక్తుల్లో విటమిన్ కె లోపం చాలావరకు తక్కువ. కానీ మారుతున్న ఆహార అలవాట్లు, జీవన విధానం దీని లోపానికి కారణమవుతోంది. దీనిని ‘విటమిన్ కె అంటగోనిజమ్’గా పిలుస్తారు. మన పేగుల్లో విటమిన్ కె ను తయారుచేసే బ్యాక్టీరియా తగ్గిపోవడం, అధికంగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకోలేని రుగ్మతలు (ఫ్యాట్ మాల్ అబ్జార్ ప్షన్), సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలేయ సమస్యలు విటమిన్ కె లోపానికి కారణమవుతాయి. ఇక గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులున్నవారు రక్తాన్ని పలుచన చేసేందుకు ఉపయోగించే కొన్ని రకాల మందులు విటమిన్ కె పనితీరును దెబ్బతీస్తాయి. విటమిన్ కె లోపిస్తే గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టదు. దాంతో నిరంతరంగా రక్తస్రావం జరుగుతుంది. అంతేకాదు శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ ఉండే పొర (మ్యూకోస్)ల్లో రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు ప్రబలి మరణించే అవకాశాలు పెరుగుతాయి. గాయాల నుంచి సాధారణం కంటే అధికంగా రక్త స్రావం జరుగుతూ ఉంటే విటమిన్ కె లోపం ఉన్నట్లుగా గుర్తించవచ్చు. ఇక విటమిన్ కె ఉత్ప్రేరకంగా రక్తంలోకి విడుదలయ్యే ప్రొత్రాంబిన్ వంటి ప్రొటీన్ల స్థాయిలను పరిశీలించడం ద్వారా, సీరంలో విటమిన్ల స్థాయి పరీక్ష ద్వారా కూడా గుర్తించవచ్చు.

శిశువులకు చాలా అవసరం

అప్పుడే పుట్టిన శిశువులకు విటమిన్ కె అత్యవసరం. ఎందుకంటే తల్లి కడుపులో ఉండగా.. శిశువులకు విటమిన్ కె అందదు. తల్లి నుంచి బిడ్డకు అనుసంధానంగా ఉండే మాయ (ప్లెసెంటా) కొవ్వు పదార్థాలను, అందులో కరిగి ఉండే విటమిన్ కె ను రవాణా చేయనివ్వదు. దాంతో విటమిన్ కె నిల్వలేమీ లేకుండానే శిశువులు జన్మిస్తారు. దీంతోపాటు పుట్టిన కొద్ది రోజుల దాకా శిశువుల పేగుల్లో ‘సహ జీవన’ బ్యాక్టీరియా వృద్ధి చెందదు. తల్లి పాలలో కూడా విటమిన్ కె చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మొత్తంగా శిశువులకు విటమిన్ కె అందని కారణంగా వారు పుట్టిన మొదటి రోజు నుంచి ఏడెనిమిది రోజుల లోపు రక్తస్రావ సమస్య ‘హెమరియేజిక్ డిసీజ్ (విటమిన్ కె డిఫిషియెన్సీ బ్లీడింగ్ - వీకేడీబీ)’ తలెత్తే అవకాశముంది. 
దీంతోపాటు కేవలం తల్లిపాలు పట్టడం, జీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలు ఉన్న చిన్నారుల్లో రెండు నెలల వయసు వరకూ కూడా ఈ జబ్బు వస్తుంది. పలు సందర్భాల్లో పరిస్థితి విషమించి శిశువులు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. అందువల్ల శిశువులకు పుట్టిన వెంటనే విటమిన్ కె ను నోటి ద్వారా చుక్కల రూపంలో అందజేస్తారు. శిశువులకు విటమిన్ కె లోపం ఉండే అవకాశమున్నందు వల్లే సాధారణంగా శిశువులకు ఇచ్చే మందులు, ఫార్ములాల్లో విటమిన్ కె కూడా ఒక సప్లిమెంట్ గా ఉంటుంది.

గుండె, రక్తనాళాల సమస్యలున్నవారు వేసుకోవద్దు..

గుండె, రక్తనాళాల సమస్యలతో బాధ పడుతూ రక్తాన్ని పలుచన చేసే మందులు వినియోగిస్తున్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు, ఊబకాయులు, మధుమేహం ఉన్నవారు విటమిన్ కె విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. విటమిన్ కె మాత్రలు, విటమిన్ కె అదనపు సప్లిమెంట్ గా ఉన్న మాత్రలకు దూరంగా ఉండాలి. ఇది ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇలాంటి వారికి విటమిన్ కె మోతాదు ఎక్కువగా అందితే అది రక్తం గడ్డకట్టడానికి దారితీసి.. గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు శరీరంలో ఇతర భాగాల్లోనూ రక్తనాళాలు దెబ్బతినవచ్చు కూడా. ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణులైన వైద్యుల సలహా తీసుకుని, వారు సూచించిన మోతాదుల్లో మాత్రమే విటమిన్ కె ను తీసుకోవాలి.

తయారయ్యేది మన కడుపులోనే..

సాధారణంగా మనకు అవసరమైన విటమిన్ కె లో చాలా వరకు మన పేగుల్లో ఉండే కోలోనిక్ బ్యాక్టీరియా ద్వారానే తయారవుతుంది. ఇక బచ్చలి వంటి ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రాకొలీ, అవగాడో, ద్రాక్ష, సోయాబీన్, ఆలివ్ నూనె, మాంసం, పాలు, గుడ్లు, చేపలు, కాలేయం, తృణ ధాన్యాల్లో లభిస్తుంది.

పరిమితికి మించి వాడొద్దు

ఒక వేళ విటమిన్ కె మోతాదు ఎక్కువైతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొట్ట తగ్గిపోవడం, నీరసం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, శరీరంలో అక్కడక్కడా వాపు, నొప్పులు, కండరాలు పట్టేసినట్టుగా ఉండడం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడంతో పాటు అరుదుగా మింగడంలో సమస్యలు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం, గుండె కొట్టుకునే వేగంలో తేడాలు, రక్తపోటు పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ కెను వాడడం శ్రేయస్కరం.representation image

విటమిన్ సి.. గుండెకు రక్ష

మన శరీరంలో కణాల పెరుగుదల, పునరుద్ధరణకు విటమిన్ సి అత్యవసరం. గుండెకు, రక్త కణాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి రసాయనిక నామం ఆస్కార్బిక్ యాసిడ్. సాధారణంగా చెప్పాలంటే మనకు తరచూ వచ్చే రుగ్మత అయిన జలుబుకు కూడా విటమిన్ సి మంచి నిరోధకారి. శరీరంలో వివిధ కణజాలాలను పట్టి ఉంచే కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తికి విటమిన్ సి కీలకం. చర్మ కణాలు, రక్త నాళాలతో పాటు కండరాలు, ఎముకల మధ్య అనుసంధానం కల్పించే టెండాన్ లు, లిగమెంట్లు తయారు కావడానికి, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది అవసరం. ఎర్ర రక్త కణాల తయారీకి అవసరమైన ఐరన్ ను ఆహారం నుంచి శరీరం సంగ్రహించడానికి విటమిన్ సి తోడ్పడుతుంది. ఇక అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం... కార్టిలేజ్ (మృదులాస్థి), ఎముకలు, దంతాలు దెబ్బతిన్నప్పుడు వాటిని పునరుద్ధరించడానికి, గాయాలు మానిపోవడానికి శరీరం విటమిన్ సి ని వినియోగించుకుంటుంది. 
కాలుష్యం, పొగతాగడం, అల్ట్రా వయోలెట్ (యూవీ) కిరణాల ప్రభావంతో శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడడం కారణంగా వచ్చే సమస్యలను నియంత్రించి కేన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరపు, దృష్టిలోపం వంటి సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ ఈ, బీటా కెరోటిన్ (విటమిన్ ఏ), జింక్ సప్లిమెంట్లతో కలిపి రోజుకు 500 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకుంటే.. వారిలో వృద్ధాప్యంలో కండరాలు కుచించుకుపోవడాన్ని 25 శాతం వరకు, దృష్టి సమస్యలు ఏర్పడడాన్ని 19 శాతం తగ్గిస్తుందని అమెరికన్ నేషనల్ ఐ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక ఎల్ డీ ఎల్ (బ్యాడ్) కొలెస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా రక్తనాళాలు గట్టిపడకుండా విటమిన్ సి సహాయపడుతుందని... తద్వారా గుండెపోటు వచ్చే ముప్పును తగ్గిస్తుందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆయా వ్యక్తుల వయస్సు, స్త్రీ పురుషులు, ఇతర అంశాల ఆధారంగా రోజువారీ విటమిన్ సి అవసరాల్లో మార్పులు ఉంటాయి. సాధారణంగా మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాములు, పురుషులకు 90 మిల్లీగ్రాములు విటమిన్ సి అవసరం. అదే గర్భిణులు, పిల్లలకు పాలిస్తున్న తల్లులకు 80 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు అవసరం.

లోపిస్తే గాయాలు మానవు..

తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే అలవాటు లేనివారిలో విటమిన్ సి లోపం కనిపిస్తుంది. అయితే విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్. ఇది శరీరంలో నిల్వ ఉండదు. అందువల్ల ఎప్పటికప్పుడు విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవాల్సిందే. ఒకసారి ఎక్కువగా తీసుకున్నా కూడా మూత్ర పిండాల్లో వడపోతకు గురై మూత్రం ద్వారా బయటకు వెళ్లపోతుంది. అందువల్ల విటమిన్ సి లోపం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారికి విటమిన్ సి హెచ్చు మోతాదులో కావాల్సి ఉంటుంది. ఇక తీవ్ర జ్వరం, డయేరియా వంటి వాటి బారినపడినప్పుడు, ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నవారికి, చర్మంపై కాలిన గాయాలైన వారికి కూడా విటమిన్ సి అవసరం ఎక్కువ. 
విటమిన్ సి లోపం వల్ల సాధారణంగా పిప్పిపళ్లు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చర్మం ఎండిపోయి పొలుసుల్లా ఏర్పడడం, వెంట్రుకలు పొడిబారిపోయి రాలిపోవడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఇన్ఫెక్షన్లకు సులువుగా లోనుకావడం, గాయాలు మానడానికి ఎక్కువ కాలం పట్టడం, నీరసం, బలహీనత వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అదే ఈ లోపం దీర్ఘకాలం పాటు ఉంటే స్కర్వీ వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది. రక్తహీనత కూడా రావచ్చు. విటమిన్ సి లోపాన్ని రక్తంలో విటమిన్ సి స్థాయులను పరిశీలించడం ద్వారా గుర్తించవచ్చు.

పిల్లలు, వృద్ధులకు బాగా అవసరం

సాధారణంగా శిశువులకు విటమిన్ సి లోపం ఉండే అవకాశం తక్కువ. తల్లిపాల ద్వారా తగిన మోతాదులో అందుతుంది. కానీ తల్లిపాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత చిన్నారుల్లో విటమిన్ సి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో స్కర్వీ అనే వ్యాధి బారిన పడవచ్చు. విటమిన్ సి లోపం ఉన్న పిల్లలు నడిచేటపుడు కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. సరైన స్థాయిలో బరువు పెరగరు. ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. రక్తస్రావం, రక్త హీనత తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇక పెద్ద వయసు వారిలో కండరాలు కుచించుకుపోవడం, కీళ్ల నొప్పులు, బరువు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటాయి. వృద్ధాప్యం లక్షణాలు వేగంగా ముసురుకుంటాయి.

పుల్లటి పదార్థాలేవైనా..

సహజ సిద్ధంగానే విటమిన్ సి లభించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా పుల్లగా ఉండే పండ్లు, కూరగాయల్లో ఇది విస్తృతంగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, మామిడి, బొప్పాయి, జామ, ఫైనాపిల్, కివి, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, ఆకుకూరలు, మిరపకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, బంగాళదుంప, బ్రాకొలీ, మొలకెత్తిన పప్పు ధాన్యాలు వంటివి విటమిన్ సి కి మంచి వనరులు. అయితే విటమిన్ సి అస్థిర పదార్థం. ఇది ఒక స్థాయికి మించి వేడిచేస్తే నశించిపోతుంది. అందువల్ల కూరగాయలనుగానీ, విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు వేటినిగానీ ఎక్కువగా ఉడికించకూడదు. వేపుళ్లు వంటివి చేస్తే విటమిన్ సి అసలు లభించదు.

ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు

విటమిన్ సి ని మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. రోజులో 2 గ్రాములకు మించి తీసుకుంటే.. గుండె కొట్టుకునే వేగంలో తేడాలు, డయేరియా వంటివి వచ్చే ప్రమాదం ఉంది. మరికొందరిలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు తలెత్తుతాయి.

ఇష్టం వచ్చినట్లుగా వాడితే ప్రమాదం

విటమిన్లు శరీరానికి ఎంతో అవసరమైనవే అయినా... వాటిని మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదం. ముఖ్యంగా మల్టీవిటమిన్ టాబ్లెట్లలో విటమిన్లతోపాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. వీటి పరిమితి మించితే దుష్పరిమాణాలు మరింత ఎక్కువగా ఉంటాయి. విటమిన్ మాత్రలు వినియోగిస్తున్నవారు కొన్ని లక్షణాల ఆధారంగా మోతాదులు మించినట్లు గుర్తించవచ్చు. ముఖ్యంగా తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం, పెదవులు పగలడం, చర్మం ఎండిపోవడం, కళ్ల మంటలు, ఎక్కువ వెలుతురును చూడలేకపోవడం, గుండె వేగం పెరగడం, కీళ్లు, కండరాల నొప్పులు, బలహీనత, తలనొప్పి, వెంట్రుకలు రాలిపోవడం, రక్తంతో కూడిన విరేచనాలు, కడుపునొప్పి వంటి తలెత్తుతాయి. ఇటువంటి సమస్యలు తలెత్తినప్పడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి, ఏయే విటమిన్ మాత్రలను ఏయే మోతాదుల్లో, ఎంతకాలం నుంచి వినియోగిస్తున్నారో వివరించి తగిన చికిత్స చేయించుకోవాలి. అలాగాకుండా దీర్ఘకాలం పాటు విటమిన్ మాత్రలను వాడడం మంచిది కాదు.



Friday, 17 March 2017

SOME OF THE MOST USEFUL Windows RUN COMMANDS...


know there are a lot of people who love using the run prompt or the command prompt rather than using the control panel So here are some quick tips and tricks that you can use directly in the run box . 
  • Accessibility Controls : access.cpl
  • Add Hardware Wizard : hdwwiz.cpl
  • Add/Remove Programs : appwiz.cpl
  • Administrative Tools : control admintools
  • Automatic Updates : wuaucpl.cpl
  • Bluetooth Transfer Wizard : fsquirt
  • Calculator : calc
  • Certificate Manager : certmgr.msc
  • Character Map : charmap
  • Check Disk Utility : chkdsk
  • Clipboard Viewer : clipbrd
  • Command Prompt : cmd
  • Component Services : dcomcnfg
  • Computer Management : compmgmt.msc
  • Date and Time Properties : timedate.cpl
  • DDE Shares : ddeshare
  • Device Manager : devmgmt.msc
  • Direct X Control Panel (If Installed)* : directx.cpl
  • Direct X Troubleshooter : dxdiag
  • Disk Cleanup Utility : cleanmgr
  • Disk Defragment : dfrg.msc
  • Disk Management : diskmgmt.msc
  • Disk Partition Manager : diskpart
  • Display Properties : control desktop
  • Display Properties : desk.cpl
  • Display Properties (w/Appearance Tab Preselected) : control color
  • Dr. Watson System Troubleshooting Utility : drwtsn32
  • Driver Verifier Utility : verifier
  • Event Viewer : eventvwr.msc
  • File Signature Verification Tool : sigverif
  • Findfast : findfast.cpl
  • Folders Properties : control folders
  • Fonts : control fonts
  • Fonts Folder : fonts
  • Free Cell Card Game : freecell
  • Game Controllers : joy.cpl
  • Group Policy Editor (XP Prof) : gpedit.msc
  • Hearts Card Game : mshearts
  • Iexpress Wizard : iexpress
  • Indexing Service : ciadv.msc
  • Internet Properties : inetcpl.cpl
  • IP Configuration (Display Connection Configuration) : ipconfig /all
  • IP Configuration (Display DNS Cache Contents) : ipconfig /displaydns
  • IP Configuration (Delete DNS Cache Contents) : ipconfig /flushdns


  • కిడ్నీలలో స్టోన్స్ ఎందుకు వస్తాయి...? తీసుకోవాల్సిన జాగ్రత్తలు...


    ఆధునికతతో మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మూత్ర పిండాల్లో రాళ్లు, కిడ్నీ కేన్సర్ వంటివైతే చాప కింద నీరులా తెలియకుండానే విస్తరిస్తున్నాయి. పెద్ద వయస్సు వారే కాదు.. ఇటీవలి కాలంలో 30 - 35 ఏళ్ల వయసున్న వారిలోనూ ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. మూత్ర పిండాలు దెబ్బతినడంతో ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపైనా పడి.. కాలేయ సమస్యలు, గుండె జబ్బులు, మూత్రాశయ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కమ్ముకుంటున్నాయి. చివరికి వృద్ధాప్యం వచ్చే సరికి శరీరంలో సత్తువ పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. మరి శరీరంలో కిడ్నీల ప్రాధాన్యత ఏమిటి, వాటి పనితీరు ఎలా ఉంటుంది? కిడ్నీల్లో రాళ్లు ఎందుకు, ఎలా ఏర్పడతాయి? కిడ్నీ జబ్బులు, సమస్యల నుంచి ఎలా బయటపడొచ్చనే అంశాలను వివరంగా తెలుసుకుందాం..

    మన పిడికిలి పరిమాణంలో..

    మన శరీరం వెనుక భాగంలో నడుము ప్రాంతంలో వెన్నెముకకు ఇరువైపులా మూత్ర పిండాలు ఉంటాయి. ఎవరి పిడికిలి ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో వారి కిడ్నీలు ఉంటాయి. వీటిలో నెఫ్రాన్లు అని పిలిచే అతి చిన్న ఫిల్టర్లు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. ఒక్కో నెఫ్రాన్ లో గ్లోమెరులస్, ట్యూబ్యుల్ అనే రెండు భాగాలు ఉంటాయి. కిడ్నీల్లోని నెఫ్రాన్ల ద్వారా రక్తం సరఫరా అయినప్పుడు.. తొలుత గ్లోమెరులస్ రక్తంలోని విషపదార్థాలను, పలు రకాల రసాయనాలు, ద్రవ పదార్థాలను జల్లెడ పడుతుంది. తర్వాత వీటిని ట్యూబ్యుల్ మరోసారి జల్లెడ పట్టి శరీరానికి అవసరమైన మినరల్స్ ను సంగ్రహించి.. తిరిగి రక్తంలోకి పంపుతుంది. ఇక వ్యర్థాలు మూత్రం రూపంలో యుటెరరీ నాళాల ద్వారా ప్రవహించి మూత్రాశయం (బ్లాడర్)లో నిల్వ అవుతాయి. తర్వాత మూత్ర నాళం ద్వారా విసర్జింపబడుతుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరం విషపూరితమై.. చివరికి మరణం కూడా సంభవిస్తుంది.

    కిడ్నీలు చేసే పని ఏమిటి?

    శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను జల్లెడ పట్టి విసర్జించడం మూత్ర పిండాల ప్రధాన విధి. 
    ఎర్ర రక్త కణాల తయారీకి, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడే హార్మోన్లను, రక్తపోటును నియంత్రించే హార్మోన్లను కిడ్నీలు తయారు చేస్తాయి. 
    కిడ్నీలు రోజూ 110 నుంచి 145 లీటర్ల రక్తాన్ని జల్లెడ పట్టి... నీరు, వ్యర్థాలతో కూడిన లీటరు నుంచి రెండు లీటర్ల మూత్రాన్ని బయటకు విసర్జిస్తాయి. (మనుషుల్లో మొత్తంగా ఉండే రక్తం 4.5 లీటర్ల నుంచి 5 లీటర్లే. అయితే రక్తం శరీర కణాలకు ఆక్సిజన్ ను అందించి, వ్యర్థాలను తీసువచ్చే పనిని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో శరీరం మొత్తం రోజుకు 20 - 30 సార్లు తిరుగుతుంది.)

    సమస్యలకు కారణాలేమిటి?

    విపరీత ఆహార అలవాట్లు, జీవన శైలి, జన్యు వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకోవడం వంటివి కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి. 
    కిడ్నీ సమస్యలు ముదిరితే చివరికి అవి పూర్తిగా పనిచేయకుండా పోతాయి. 
    విటమిన్ సి, కాల్షియం సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. 
    రెండు కిడ్నీలు కూడా బాగా దెబ్బతింటే కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవడం లేదా జీవితాంతం డయాలసిస్ చేయించుకోవడం తప్పనిసరి. 
    సాధారణంగా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఒక కిడ్నీతో కూడా మనిషి పూర్తి ఆరోగ్యంగా జీవించగలడు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులు కిడ్నీ చెడిపోయిన తమ కుటుంబ సభ్యులకు కిడ్నీని దానం చేయవచ్చు.

    మూత్ర పిండాలకు వచ్చే సమస్యలేమిటి?

    మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వంటివి సాధారణంగా ఏర్పడే సమస్యలు. ఇక ఎక్కువగా వచ్చే కేన్సర్లలో మూత్ర పిండ కేన్సర్ ఒకటి. రెనల్ సెల్ కార్సినోమాగా దీనిని పిలుస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ), యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (పీకేడీ) వంటి సమస్యలు తలెత్తుతాయి.

    కిడ్నీల్లో రాళ్లతో ఎన్నో సమస్యలు

    మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య చాలా మందికి తెలిసినదే. కిడ్నీలు రక్తంలో నుంచి జల్లెడ పట్టిన ఖనిజాలు, ఆమ్ల లవణాలు ఒకదానికొకటి కలసి గట్టిపడి రాళ్లలా రూపొందుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రాళ్లుంటే మిగతా వారికీ ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇక ఇంతకు ముందు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన వారికి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మళ్లీ రాళ్లు వస్తాయి. శరీరానికి తగినంత మోతాదులో నీరు అందకపోవడం వల్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రక్తంలో పరిమితికి మించి ఉన్న కాల్షియం, ఆక్సలేట్, యూరేట్, ఫాస్పేట్, సిస్టిన్, వంటి రసాయనాలు, ఆమ్లాలు, నీరు వంటి ద్రవాలను కిడ్నీలు వడగడతాయి. నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వడగట్టిన రసాయనాలు బాగా చిక్కగా ఉండి.. ఒకదానికొకటి అతుక్కుని గట్టిపడతాయి. అవే చివరికి రాళ్లలా మారుతాయి. కాలం గడిచిన కొద్దీ ఈ రాళ్ల పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ రాళ్లు ఇసుక రేణువులంత పరిమాణం నుంచి నిమ్మకాయల సైజు వరకూ ఉండవచ్చు. అయితే రాళ్లు చిన్నగా ఉన్నప్పుడే నీరు ఎక్కువగా తీసుకుంటే అవి మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. చాలా మంది సాధారణ వ్యక్తుల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. కొందరిలో మాత్రం రాళ్లు పెద్దవై మూత్ర పిండంలోగానీ, నాళాల్లోగానీ ఇరుక్కుపోతాయి. దానివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. మూత్రం మంటగా ఉంటుంది. రక్త స్రావం కనబడుతుంది.

    ఈ సమస్య ఎవరికి వస్తుంది?

    తగినంత మోతాదులో నీళ్లు తాగని వారికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. చక్కెర, ఉప్పు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఊబకాయం, కాల్షియం సప్లిమెంట్లు అధికంగా తీసుకోవడం, విపరీతంగా ఆల్కాహాల్ వినియోగం, గ్యాస్ట్రిక్ సమస్యలకు చికిత్స పొందుతున్నవారికి, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రాళ్ల సమస్య ఉన్న వారికి రాళ్లు వస్తాయి. వీటిలో కాల్షియం, ఆక్సలేట్లు కలసి గట్టి పడడం వల్ల ఏర్పడే ఆక్సలేట్ రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, కాల్షియం రాళ్లు, స్ట్రువైట్ స్టోన్స్ తదితరాలు ఉంటాయి. పురుషుల్లో 19 శాతం మందికి, స్త్రీలలో 9 శాతం మందికి కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

    రాళ్లుంటే కనబడే లక్షణాలు

    సాధారణంగా 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. 
    రాళ్లు ఉన్నవారికి ముఖ్యంగా నడుము కింది భాగంలో ఒకవైపు తరచూ విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు పొత్తి కడుపు వరకూ ఉంటుంది. 
    మూత్రం విసర్జించేటపుడు నొప్పి, మంట వస్తాయి. మూత్రంలో రక్త స్రావం కనిపిస్తుంది. 
    మూత్రం ఎరుపు, గోధుమ రంగులో వస్తుంది, దుర్వాసన ఉంటుంది. తరచుగా కొద్ది కొద్దిగా మూత్రం వస్తుంది. 
    కొందరిలో విపరీతమైన నీరసం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. 
    రక్త, మూత్ర పరీక్షల్లో కాల్షియం, యూరిక్ యాసిడ్ స్థాయులను గుర్తించడం ద్వారా రాళ్లు ఉన్నట్లుగా గుర్తించవచ్చు. ఇక సీటీ స్కాన్ ద్వారా అయితే రాళ్లు కిడ్నీలో ఉన్నాయా, నాళాల్లో ఉన్నాయా అనే అంశంతోపాటు వాటి పరిమాణాన్ని కూడా కచ్చితంగా గుర్తించవచ్చు. 
    మూత్ర పిండాల్లో రాళ్లను తొలగించడానికి మూడు రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. 
    రాళ్లు కరిగేందుకు కొన్ని రకాల ఔషధాలతో చికిత్స చేస్తారు. రాళ్లు చిన్నవిగా ఉంటే, అవి కూడా కిడ్నీలో ఉన్నప్పుడే ఈ చికిత్స పనిచేస్తుంది. అంతేగాకుండా ఈ ఔషధాలు దీర్ఘకాలం వాడాలి. ఈ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఔషధాలు సరిగా పనిచేయవు. 
    రాళ్లు కొంచెం పెద్దగా ఉండి, కిడ్నీల నుంచి బ్లాడర్ కు వెళ్లే నాళాల్లో ఇరుక్కుపోయినప్పుడు ‘షాక్ వేవ్ లితోట్రిప్సీ’ చికిత్స ద్వారాగానీ, లేజర్లతోగానీ వాటిని పగులగొడతారు. చిన్న ముక్కలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. 
    రాళ్లు మరీ పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స (ఆపరేషన్) చేసి తొలగించాల్సి ఉంటుంది.

    నీళ్లే అసలు ఔషధం

    కిడ్నీలు సరిగా పనిచేయడానికి శరీరానికి తగినంత మోతాదులో నీళ్లు అందుతుండడం అవసరం. రోజూ 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితే రాళ్ల సమస్యకు దూరంగా ఉండొచ్చు. 
    మూత్ర పిండాలు దెబ్బతిన్నవారిలో ఎక్కువ శాతం నీటిని సరిగా తాగకపోవడమో, డీహైడ్రేషన్ సమస్యలకు తరచూ గురై ఉండడమో కారణమని వెల్లడైనట్లు అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ బక్ పార్కర్ తన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. కూల్ డ్రింకులు, కాఫీ వంటి కెఫీన్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని.. నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. 
    ముఖ్యంగా ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అందువల్ల ఆల్కాహాల్ కు దూరంగా ఉండడం మంచిది. 
    విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ బి9 (ఫోలిక్ యాసిడ్), విటమిన్ ఏ లు కిడ్నీలు సరిగా పనిచేయడానికి తోడ్పడుతాయని అమెరికాలోని ఆరెంజ్ కోస్ట్ మెమోరియల్ మెడికల్ సెంటర్ వైద్యులు క్రిస్టిన్ ఆర్థర్ వెల్లడించారు. 
    ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది. మాంసాహారం తగ్గించి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 
    పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, బీడీల వంటివాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. 
    కిడ్నీ సమస్యలు తలెత్తిన వారు కచ్చితంగా వారి రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే కిడ్నీలు మరింతగా దెబ్బతింటాయి. 
    కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లను బట్టి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మూత్ర పరీక్షల ద్వారా ఆ రాళ్లు ఏ తరహావి అనేది నిర్ధారిస్తారు. 
    కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడినవారు బచ్చలికూర, చుక్కకూర, గోధుమ మొలకలు, నట్స్, ముల్లంగి ఆకులు వంటివాటికి దూరంగా ఉండాలి. 
    యూరిక్ యాసిడ్ రాళ్లున్నవారు అత్యధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తికి ప్రొటీన్లు దోహదం చేస్తాయి. 
    కాల్షియం రాళ్లున్నవారు ఉప్పు తగ్గించాలి. కాల్షియం సప్లిమెంట్లు వాడకూడదు. ఎందుకంటే ఉప్పులోని సోడియం కారణంగా శరీరం కాల్షియం ను ఎక్కువగా విసర్జిస్తుంది. అది కిడ్నీల్లో రాళ్లుగా మారుతుంది.

    కిడ్నీ ఇన్ఫెక్షన్లు

    కిడ్నీలకు ఇన్ఫక్షన్లు సోకడానికి ప్రధాన కారణం ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా తొలుత మూత్రాన్ని విసర్జించే నాళం ద్వారా బ్లాడర్ లోకి చేరుతుంది. అక్కడి నుంచి నాళాల ద్వారా కిడ్నీలకు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీనిని గుర్తించి తగిన చికిత్స చేయకపోతే మూత్ర పిండాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.

    క్రానిక్ కిడ్నీ డిసీజ్ (తీవ్రమైన మూత్ర పిండాల వ్యాధి)

    మూత్ర పిండాలు క్రమ క్రమంగా దెబ్బతిని పూర్తిగా పనిచేయని స్థితికి వెళ్లే వ్యాధి ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’. దీనినే క్రానిక్ రెనల్ డిసీజ్ అని కూడా అంటారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. కిడ్నీలు దెబ్బతినడం మొదలైన తర్వాత రక్తంలో వ్యర్థ రసాయనాలు పేరుకుపోతూ విషంగా పరిణమిస్తాయి. దీంతో కిడ్నీలు మరింతగా దెబ్బతింటాయి. రక్తపోటు పెరుగుతుంది. రక్తంలో ఎర్రరక్త కణాలు తగ్గిపోయి ఎనీమియా వస్తుంది. 
    శరీరంలో ఎముకలు బలహీనం అవుతాయి. నాడులు దెబ్బతింటాయి. చివరికి మరణం కూడా సంభవిస్తుంది. అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం ఉన్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధుల కారణంగా కిడ్నీల్లో అంతర్గతంగా ఉండే సన్నని రక్త నాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీలు వ్యర్థాలు, రసాయనాలను సరిగా జల్లెడ పట్టలేక.. అవి రక్తంలోనే ఉండిపోతాయి. అసలు ఈ వ్యాధిని ‘సైలెంట్ డిసీజ్’గా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి ముదిరేవరకూ లక్షణాలు పెద్దగా కనిపించవు. కుటుంబంలో ముందు తరాల వారెవరికైనా ఈ వ్యాధి ఉంటే వారి వారసులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

    లక్షణాలు ఇవి..

    విపరీతమైన నీరసం, ఆకలి మందగించడం, నిద్ర పట్టకపోవడం, దేనిపైనా సరిగా దృష్టి పెట్టలేకపోవడం, పాదాలు, చీల మండల వాపు, పొద్దున పూట కళ్ల చుట్టూ ఉబ్బడం, చర్మం ఎండిపోయి దురదగా అనిపించడం, సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ముఖ్యంగా రాత్రిపూట మూత్రం ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
    రక్తంలో క్రియాటినైన్ స్థాయులను పరీక్షించే ‘ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ (ఈజీఎఫ్ఆర్) టెస్టు, అల్బుమిన్-క్రియాటినైన్ నిష్పత్తిని పరిశీలించే ఏసీఆర్ లేదా మైక్రో అల్బుమిన్ టెస్టుల ద్వారా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ను, దాని తీవ్రతను తెలుసుకోవచ్చు. 
    ఇక అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ ల సహాయంతో కిడ్నీల పరిమాణం, వాటి పరిస్థితి, రాళ్లు, ట్యూమర్లేమైనా ఉన్నాయా అనే అంశాలను గుర్తించవచ్చు. 
    మూత్ర పిండంలోని చిన్న భాగాన్ని సేకరించి (బయాప్సీ) పరీక్షించడం ద్వారా ఎంత వరకు దెబ్బతిన్నది, ఎలాంటి చికిత్స అవసరమనేది పరిశీలిస్తారు. 
    ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’కు నేరుగా చికిత్స చేసేందుకు ప్రత్యేకించిన ఔషధాలేమీ లేవు. అందువల్ల అసలు ఈ వ్యాధికి కారణమైన వాటిని నియంత్రించేందుకు వైద్యులు చర్యలు చేపడతారు. 
    రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉంటే యాంటీ బయాటిక్ లతో చికిత్స చేస్తారు. 
    మూత్ర పిండాల వ్యాధి ముదిరి అవి పూర్తిగా పనిచేయలేని పరిస్థితి నెలకొంటే.. ‘డయాలసిస్’ చేస్తారు.

    పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (పీకేడీ)

    కిడ్నీల్లో ద్రవాలతో కూడిన కంతులు ఏర్పడడమే పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (పీకేడీ). ఇది జన్యువుల్లో లోపం కారణంగా వారసత్వంగా సంక్రమించే వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి ముదిరే వరకు బయటపడే అవకాశం తక్కువ. కొందరిలో మాత్రం నొప్పి, మూత్రంలో రక్తం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్ట్రా సోనోగ్రఫీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, ఎమ్మారై స్కానింగ్ ల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారిలో సగం మందికిపైగా కచ్చితంగా నిత్యం డయాలసిస్ చేయడమో లేదా కిడ్నీ మార్పిడి చేయడమో తప్పదు. ఈ వ్యాధి ఉన్నవారిలో 30 శాతం మందికి కాలేయంలోనూ కంతులు ఏర్పడుతాయి. అయితే కాలేయం పనితీరు పెద్దగా దెబ్బతినదు. కానీ రక్తనాళాలు దెబ్బతిని గుండె, మెదడులో రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పక్షవాతం రావొచ్చు. జన్యువుల్లో రెండు రకాల లోపాల కారణంగా పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. డామినెంట్ జన్యువుల ద్వారా వచ్చే పాలీసిస్టిక్ డిసీజ్ దాదాపుగా యుక్త వయసు వచ్చే వరకు బయటపడదు. అదే రెసెస్సివ్ జన్యువుల వచ్చే వ్యాధి చిన్నతనంలోనే బయటపడుతుంది.

    డయాలసిస్ ఎన్ని విధాలు..

    వ్యాధి ముదిరి మూత్ర పిండాలు దాదాపుగా పనిచేయని పరిస్థితుల్లో ‘డయాలసిస్’ చేయాల్సి ఉంటుంది. రక్తాన్ని కిడ్నీలు శుద్ధి చేసే తరహాలోనే కృత్రిమ కిడ్నీల్లా పనిచేసే పరికరాల ద్వారా శుద్ధి చేయడమే డయాలసిస్. ఈ యంత్రాలను ‘హెమోడయలైజర్’ అంటారు. బాధితుల భుజం వద్దగానీ, కాలు వద్దగానీ చిన్న శస్త్రచికిత్స చేసి.. అక్కడి రక్తనాళానికి ‘హెమోడయలైజర్’ను అనుసంధానిస్తారు. హెమోడయాలసిస్ గా పిలిచే ఈ విధానంలో పరికరం శరీరం బయటే ఉంటుంది. రక్తం పైపుల ద్వారా హెమోడయలైజర్ కు వచ్చి, అక్కడ వ్యర్థాలు వడపోత అయిన తర్వాత తిరిగి శరీరంలోకి వెళుతుంది. 
    ఇక మరో విధానం పెరిటోనియల్ డయాలసిస్. ఈ విధానంలో హెమోడయలైజర్ పరికరాన్ని శరీరం లోపలే అమర్చుతారు. పొట్ట ప్రాంతంలో శస్త్రచికిత్స చేసి ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లేదా కాథటర్ ను అమర్చుతారు. ఇందులోకి ‘డయాలైసేట్’గా పిలిచే ప్రత్యేకమైన ద్రవాన్ని మెల్లగా నింపుతారు. పొట్టలోని అవయవాల చుట్టూ రక్షణగా ఉండే కండరపు పొర (అబ్డామెన్ వాల్) అవతలి వైపు ఉండే ఈ కాథటర్ లోని ద్రవం.. అక్కడి రక్తం నుంచి అదనపు రసాయనాలు, ద్రవాలు, వ్యర్థాలను పీల్చుకుంటుంది. తర్వాత వ్యర్థాలతో కూడిన ఈ డయాలైసేట్ ను బయటికి తీసేసి.. మళ్లీ తాజా డయాలైసేట్ తో నింపుతారు. దీనిలోనూ రెండు రకాలున్నాయి. నిర్ధారిత సమయాల్లో మాన్యువల్ గా డయాలైసేట్ ను నింపుతూ తొలగిస్తూ ఉండడం ఒకటి కాగా... సైక్లర్ అనే పరికరాన్ని వినియోగించడం రెండోది. ఈ పరికరం ఆటోమేటిగ్గా డయాలైసేట్ ను నింపుతూ, తొలగిస్తూ ఉంటుంది. 
    (ఈ ఆర్టికల్ కేవలం పాఠకుల అవగాహన కోసం ఆయా నిపుణులు, అధ్యయనాల అభిప్రాయాలను క్రోడీకరించి రాసినది మాత్రమే)

    Thursday, 16 March 2017

    ఆన్ లైన్ లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా...?


    ఇల్లు, ఆఫీసు ఎక్కడున్నా కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లో కొనేయడం ఇప్పుడు కామన్ అవుతోంది. ఆఫ్ లైన్ మార్కెట్ల కంటే ఈ-కామర్స్ సైట్లు ఆఫర్లతో దంచేస్తుంటాయి. పలు రకాల కారణాల వల్ల ఆన్ లైన్ లో కొన్ని చాలా చౌక ధరలకే లభ్యమవుతుంటాయి. కాస్త టైమ్ కేటాయిస్తే ఆన్ లైన్ షాపింగ్ లో ఇంకాస్త ఆదా చేసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి.

    తక్కువ ధర ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలంటే...!

    డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, హోంనీడ్స్, హౌస్ కీపింగ్ చివరికి సబ్బులు, పప్పులు, ఉప్పు కూడా ఆన్ లైన్ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. ముందు కొనాల్సినవి ఏంటనేవి అనుకున్న తర్వాత... ఆ వస్తువు ఏ షాపింగ్ సైట్లలో తక్కువ ధరకు లభిస్తుందో తెలుసునే ప్రయత్నం చేయాలి. బై హట్కే.కామ్ అనే సైట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ అందిస్తోంది. దీనిని డౌన్ లోడ్ చేసుకుంటే... క్రోమ్ బ్రౌజర్ లో మీరు ఒక ఉత్పత్తి గురించి ఏదేనీ ఈ కామర్స్ సైట్ లో చూస్తుంటే... అదే వస్తువు వివిధ సైట్లలో తక్కువ ధరకు లభిస్తోందో ఆటేమేటిక్ గా మేసేజ్ రూపంలో బ్రౌజర్ లోనే చూపిస్తుంది. ఆన్ లైన్ లో ప్రైస్ కంపారిజన్ సైట్లు కూడా ఉన్నాయి. mysmartprice.com, shopmania.in, www.compareraja.in వంటివి కొన్ని. ఇంకా చాలానే ఉన్నాయి.

    డిస్కౌంట్ల వివరాలు...

    ఫలానా వస్తువు చౌక ఎక్కడో తెలుసుకోవడం పూర్తయితే... ఇప్పుడు ఆయా సైట్ లలో డిస్కౌంట్ లు ఉన్నాయా? లేదా? పరిశీలించాలి. కొన్ని ఇంత శాతమని అదనపు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఒక సైట్ లో ఓ వస్తువు అతి తక్కువగా రూ.100 ఉందనుకుందాం. కానీ ఆ సైట్ లో ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్లు లేవు. అదే వస్తువు రూ. 110 ధర ఉన్న మరో సైట్ లో 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంటే రూ.88కే లభిస్తుంది. అందుకే ఆన్ లైన్ షాపింగ్ లో తెలివిగా వ్యవహరించాలి. 
    ప్రైస్ కంపారిజన్ సైట్లు, మొబైల్ రీచార్జ్ సైట్లు కూడా పలు సైట్లకు సంబంధించి డిస్కౌంట్ కూపన్లు అందిస్తుంటాయి. అలాంటివి పరిశీలించాలి. వెబ్ సైట్ లో కంటే యాప్ లో కొంటే కొన్ని మరింత తగ్గింపు ధరలకే అందిస్తుంటాయి. అలాంటి ఆఫర్లు ఉన్నాయేమో సదరు ఈ కామర్స్ సైట్లలో ఆఫర్ల కోసం సెర్చ్ చేయాలి. ఉంటే సంబంధిత ప్రొమో కోడ్ ను వస్తువుకు ధర చెల్లించే ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. అది మరిచిపోతే డిస్కౌంట్ వర్తించదు. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి సంస్థలు అయితే, ఫలానా బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ అంటూ తరచుగా ఆఫర్ చేస్తుంటాయి. ఆయా కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల మరింత ఆదా చేసుకోవచ్చు. ఈబే సంస్థ అయితే, తరచూ ఎంతో కొంత డిస్కౌంట్ కూపన్లు ప్రకటిస్తుంటుంది. పెప్పర్ ఫ్రై సంస్థ రిజిస్టర్డ్ యూజర్లకు డిస్కౌంట్ కోడ్స్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది.

    పండుగ సమయాల్లో...

    దీపావళి, న్యూ ఇయర్, ఇండిపెండెన్స్ డే, బిగ్ సేల్ డేస్, యాప్ డేస్ పేరుతో ఈ కామర్స్ సైట్లు విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. వెంటనే కొనాల్సిన అవసరం లేకుంటే డిస్కౌంట్ కోసం వేచి చూడవచ్చు. కొన్ని వస్తువులు కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పన్నుల్లో మార్పుల కారణంగా తగ్గడం, పెరగడం జరుగుతుంది. అవి కూడా గమనించాలి. ధర తగ్గినప్పుడు మీకు సమాచారం ఇచ్చేందుకు cheapass.in వంటి సైట్లు కూడా ఉన్నాయి. ఆయా సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే ఆ వస్తువు ధర తగ్గిన వెంటనే సమాచారం వస్తుంది.

    ఇదో ట్రిక్!

    ఏదైనా వస్తువును కొనాలి అనుకున్నప్పుడు సంబంధిత వస్తువును కొనుగోలు చేసేందుకు షాపింగ్ కార్డ్ కు యాడ్ చేసి అలా ఉంచేయండి. కొన్ని సందర్భాల్లో ఆయా సంస్థలు షాపింగ్ కార్ట్ లో ఉన్నవాటి కొనుగోలు పూర్తి చేసేందుకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తాయి. ఇక మొబిక్ విక్ డాట్ కామ్, పేటీఎం డాట్ కామ్ వంటి సంస్థలు తమ వ్యాలెట్ల ద్వారా (అంటే ముందుగా ఆయా సైట్లలో నమోదు చేసుకుని ఉండాలి) వివిధ సైట్లలో కొనుగోలు చేస్తే ఇంత మొత్తం తగ్గింపును, క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తుంటాయి. మీకు రెండు మూడు ఈ మెయిల్స్ ఉంటే జాక్ పాటే. న్యూ యూజర్లకు అన్ని సైట్లూ తగ్గింపు ఆఫర్లు ఇస్తుంటాయి. అందుకే కొత్త మెయిల్ ఐడీ ద్వారా కొత్త వినియోగదారుడిగా నమోదై డిస్కౌంట్ పొందవచ్చు.

    అవసరం లేకుంటే ఆ వైపు కూడా చూడొద్దు

    ఈ కామర్స్ సంస్థల మధ్య విక్రయాల పోటీ తారా స్థాయికి చేరింది. ప్రతీ సంస్థ విక్రయాలు, ఆదాయాలు పెంచుకునేందుకు డిస్కౌంట్లు, ఆఫర్ల మోత మోగిస్తుంటాయి. నిజంగా కొనాల్సిన అవసరం ఉంటేనే పైన చెప్పిన చిట్కాలతో తెలివిగా చౌకగా కొనుగోలు చేసుకోవడం సరైనది. అవసరం లేని వస్తువులను ఆఫర్ల మోజులో కొని జేబులు గుల్ల చేసుకోవడం తెలివి అనిపించుకోదు.


    Wednesday, 15 March 2017

    బ్యాంక్ అక్కౌంట్స్ రకాలు గురించి తెలుసుకోండి...!


    బ్యాంకుల్లో సేవింగ్స్, కరెంట్, డిపాజిట్ ఖాతాలు ఇలా చాలానే ఉన్నాయి. ప్రతీ వ్యక్తి తన అవసరాల మేరకు ఎన్ని ఖాతాలైనా కలిగి ఉండవచ్చు. కానీ ఈ ఖాతాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ఏ ఖాతా ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే తమకు ఏ ఖాతా అనువైనదో తెలుస్తుంది. అలాగే ఓ వ్యక్తికి వాస్తవంగా ఎన్ని ఖాతాలుంటే ప్రయోజనం…అన్నది కూడా తెలుసుకుందాం.

    సేవింగ్స్ అకౌంట్

    వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం, స్వచ్చంద సంస్థలు మాత్రమే సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంది. వ్యక్తిగతంగానూ లేదా మరొకరి భాగస్వామ్యంతోనూ కలసి ఖాతా తెరవచ్చు. స్వయంగా నిర్వహించేందుకు... లేదా తమ తరఫున మరొకరు నిర్వహించేందుకు పవర్ ఆఫ్ ఆటార్నీ ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది. కనీస నగదు నిల్వను అన్ని వేళలా ఉంచాలి. ఆ మొత్తంపై వివిధ బ్యాంకులు 4 నుంచి 6 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి. ఖాతాతోపాటు ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, చెక్ బుక్ సదుపాయాలను బ్యాంకులు అందిస్తున్నాయి. అలాగే, ఖాతాతోపాటు బీమా, లాకర్ సౌకర్యాలను కూడా పొందవచ్చు. కనీస నిల్వ మొత్తాన్ని ఉంచడంలో విఫలమైతే బ్యాంకులు 30 రూపాయలు మొదలుకొని 750 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో నగదు నిల్వ ఉంచే కస్టమర్ల కోసం సేవింగ్స్ ఖాతాలనే భిన్న రకాల సౌకర్యాలతో రకరకాల పేర్లతోనూ బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ ఖాతాదారులకు కోరినన్ని చెక్ బుక్ లు, ఉచిత డీడీలు, ఉచిత ఫోన్, ఇంటర్నెట్ బ్యాకింగ్, ఇంటి ముంగిటకే బ్యాకింగ్ ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తున్నాయి. సేవింగ్స్ ఖాతాలను భిన్న రకాల ప్రయోజనాలతో ఆటో స్వీప్, శాలరీ ఇలా వివిధ పేర్లతో బ్యాంకులు అందిస్తున్నాయి.

    తాత్కాలిక అవసరాలకు మాత్రమే

    ఇంట్లో, పాకెట్ లో ఎక్కువ నగదు ఉంచుకోకుండా... సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు డెబిట్ కార్డుల ద్వారా పొందవచ్చు. అదే సమయంలో సేవింగ్స్ ఖాతాల్లో ఎక్కువ నగదు ఉంచుకోవడం కూడా సరైనది కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాల్లోని నగదు నిల్వలపై వడ్డీ రేటు ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేయగా వచ్చేది నికర నష్టం మాత్రమే. అందుకే ఒక నెల రోజుల అవసరాలకు మించి నగదును ఉంచుకోకపోవడమే సరైనది.

    ఆటో స్వీప్ అకౌంట్

    సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలతోపాటు నగదు నిల్వలను అధికంగా ఉంచుకునేవారు ఆటో స్వీప్ ఖాతాకు మారడం మంచిది. ఎందుకంటే కనీస నగదు నిల్వకు మించి ఉన్న మొత్తాన్ని బ్యాంకులు డిపాజిట్ గా మార్చి వాటిపై డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తాయి. దాంతో సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. ఉదాహరణకు కనీస నిల్వ 10వేలుగా ఉంటే... ఖాతాలో నగదు 20వేలు ఉందనుకోండి. అప్పుడు అదనంగా ఉన్న 10వేల రూపాయలను బ్యాంకులు డిపాజిట్ గా మళ్లిస్తాయి. కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలన్స్ 10వేల పైన అదనంగా వెయ్యి రూపాయలు ఉన్నా దాన్ని ఒక డిపాజిట్ చొప్పున పరిగణిస్తుండగా... కొన్ని కనీసం 5వేలు, మరికొన్ని కనీసం 10వేల మొత్తాన్ని డిపాజిట్ కింద తీసుకుంటున్నాయి. 
    అయితే, ఇందులోనూ బ్యాంకులను బట్టి నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. కొన్ని కనీసం ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటుండగా కొన్ని ఒక్క రోజుకు కూడా వడ్డీ చెల్లిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు నిర్ణీత కాలపరిమితి కంటే ముందే డిపాజిట్ లోని నగదును ఉపసంహరించుకుంటే సాధారణ సేవింగ్స్ బ్యాంకు ఖాతా వడ్డీ రేటునే అందిస్తున్నాయి. కొన్ని జరిమానా కూడా విధిస్తున్నాయి. కనుక ఆటో స్వీప్ ఖాతాకు మారే ముందు నిబంధనలు తెలుసుకోవాలి.

    వేతన ఖాతాలు

    వేతన ఖాతాలు అంటే బ్యాంకులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఖాతాల్లో నెల నెలా వేతనాలు జమ అవుతుంటాయి. ఎక్కువ మంది ఆ నగదును వెంటనే ఉపసంహరించుకోకుండా చాలా రోజులు అట్టే పెడతారు. అవసరాలకు కావాల్సినంతే ఉపసంహరించుకుంటారు. బ్యాంకులకు ఇదే బెనిఫిట్. నిజానికి వేతన ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాల్సిన పనిలేదు. జీరో బ్యాలన్స్ ఖాతాలు అవి. వేతన ఖాతాలను ఎవరికివారు వ్యక్తిగతంగా తీసుకునేందుకు అవకాశం లేదు. కంపెనీలు, సంస్థలే బ్యాంకులతో ఒప్పందం చేసుకుని తమ ఖాతాదారుల పేరిట ఖాతాలను తెరుస్తుంటాయి. ఈ ఖాతాలకు బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతీ బ్యాంకు కూడా వేతన ఖాతాల్లోనే ప్రీమియం, ప్రయారిటీ, శాలరీ, శాలరీ ప్లస్, ప్లాటినం ఇలా రకరకాల పేర్లతో వివిధ అదనపు ప్రయోజనాలతో అందిస్తున్నాయి. 
    ఉదాహరణకు ప్రైవేటు రంగంలో ప్రముఖ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ రెగ్యులర్ శాలరీ అకౌంట్, క్లాసిక్ శాలరీ అకౌంట్, ప్రీమియం శాలరీ అకౌంట్ ఇలా పలు రకాలను అందిస్తోంది. ఇవన్నీ జీరో బ్యాలన్స్ ఖాతాలే. డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తే ప్రతి వంద రూపాయలకు ఒక రూపాయిని వెనక్కి ఇస్తుంది. ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ, కుటుంబ సభ్యుల్లో ఒకరికి జీరో బ్యాలన్స్ ఖాతాను ఆఫర్ చేస్తోంది. స్వంత ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఉచిత నగదు లావాదేవీలు, ఏటీఎంల నుంచి ఒక రోజులో 50 వేల నుంచి 75 వేల వరకు నగదు ఉపసంహరణ (ప్రభుత్వ బ్యాంకుల్లో అయితే ఇది 30వేల రూపాయలే ఉంది), షాపింగ్ అయితే ఒక రోజులో డెబిట్ కార్డు ద్వారా 1.75 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. పూర్తి వివరాలకు http://www.hdfcbank.com/ లింక్ చూడవచ్చు. యెస్ బ్యాంకు కూడా స్మార్ట్ శాలరీ అడ్వాంటేజ్, స్మార్ట్ శాలరీ ఎక్స్ క్లూజివ్, స్మార్ట్ శాలరీ ప్లాటినం ఖాతాలను అందిస్తోంది. వీటిలోని బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే https://www.yesbank.in/ లింక్ చూడవచ్చు. సాధారణంగా జీరో బ్యాలన్స్, ఉచిత ఏటీఎం, డెబిట్ కార్డు (వార్షిక చార్జీలు లేకుండా), మల్టి సిటీ చెక్, ఓవర్ డ్రాప్ట్ (అంటే అవసరమైన సందర్భాల్లో నెల వేతనానికి ఒకటి నుంచి ఐదు రెట్ల వరకు నగదును డ్రా చేసుకోవచ్చు), నెలనెలా ఈ మెయిల్ కు ఖాతా స్టేట్ మెంట్, ఉచిత ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఇంటికే వచ్చి చెక్ తీసుకోవడం, చెక్, డీడీ ఇవ్వడం ఇలా పిండికొద్దీ రొట్టె అన్నట్టు బ్యాంకులు ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నాయి.

    కరెంట్ ఖాతా

    వ్యాపారస్తులు, రోజువారీ నగదు లావాదేవీలు నిర్వహించే వారికి కరెంటు ఖాతాలు అనువుగా ఉంటాయి. నగదు డిపాజిట్, ఉపసంహరణకు పరిమితి ఉండదు. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయడంతోపాటు డ్రా చేసుకోవచ్చు. చెక్ బుక్ ల విషయంలోనూ పరిమితి ఉండదు. వీటిలో ఉన్న మరో ప్రయోజనం రోజువారీ లావాదేవీలు, ఆయా ఖాతాదారుడి చరిత్ర ఆధారంగా బ్యాంకులు ఓడీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అంటే ఖాతాలో నగదు కంటే అదనంగా డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాల్లో 5 వేల నుంచి 25వేల రూపాయల వరకు నగదు నిల్వలు ఉంచడం తప్పనిసరి. దీనిపై బ్యాంకులు వడ్డీ చెల్లించవు.

    ఓడీ అన్ డిపాజిట్

    బ్యాంకులో మీకు ఓ 20వేల డిపాజిట్ ఉందనుకోండి. ఆ డిపాజిట్ పత్రాన్ని బీరువాలో భద్రంగా ఉంచారు. ఇంట్లో ఏదో అత్యవసర సందర్భం ఎదురై నగదు అవసరం ఏర్పడింది. ఎక్కడా అప్పు పుట్టలేదు. అప్పుడు బీరువాలో దాచి ఉంచిన డిపాజిట్ పత్రం ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని తీసుకుని జారీ చేసిన బ్యాంకు శాఖకు వెళ్లి ఓడీ అకౌండ్ ఓపెన్ చేసుకుంటే… 20వేల డిపాజిట్ పత్రాన్ని హామీగా ఉంచుకుని అందులో 75 నుంచి 90 శాతం వరకు రుణమిస్తారు. అంటే 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు రుణం లభిస్తుంది. రుణంపై వడ్డీ డిపాజిట్ పై చెల్లిస్తున్న వడ్డీకి అదనంగా ఒకటి లేదా రెండు శాతం విధిస్తారు. మళ్లీ చేతికి డబ్బులు అందిన వెంటనే తీసుకెళ్లి ఓడీ ఖాతాలో జమ చేసుకోవచ్చు. మళ్లీ అవసరమైనప్పుడు ఓడీ తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకుని చెల్లించలేకపోతే నిర్ణీత కాల వ్యవధి తర్వాత డిపాజిట్ ను రద్ధు చేసి రుణం కింద జమ చేసుకుంటారు. ఓడీ ఖాతాలకు కూడా చెక్ బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు పొందవచ్చు.

    జాయింట్ అకౌంట్స్

    ఐదర్ ఆర్ సర్వైవర్: ఉమ్మడి ఖాతాలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇది సాధారణ జాయింట్ అకౌంట్. ఇద్దరు వ్యక్తులు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇద్దరూ వేర్వేరు నామినీలను సూచించవచ్చు. మరణం సంభవిస్తే నామినీకి చెల్లించాల్సినది ఉంటే చెల్లిస్తారు. ఇద్దరిలో మిగిలిన వ్యక్తి ఖాతాను కొనసాగించుకోవచ్చు. 
    ఎనీవన్ ఆర్ సర్వైవర్: పై ఖాతా వలే ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ మంది ఖాతాను ఆపరేట్ చేయవచ్చు. భార్య, తల్లీ తండ్రి కూడా తన ఖాతాను ఆపరేట్ చేసుకోవాలంటే ఈ ఖాతా తీసుకోవచ్చు. ఖాతాదారుల్లో ఒకరు మరణించినా మిగిలిన వారు అదే ఖాతాను నిక్షేపంగా కొనసాగించుకోవచ్చు. 
    ఫార్మర్ ఆర్ సర్వైవర్: ఈ ఖాతాలో మొదటి ఖాతాదారుడు మాత్రమే ఖాతాను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లోనే రెండో ఖాతాదారుడు ఖాతాను కొనసాగించుకోవచ్చు. 
    లేటర్ లేదా సర్వైవర్: ఈ ఖాతాను ఉమ్మడి ఖాతాదారుల్లో రెండో ఖాతాదారుడు మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంటుంది. రెండో ఖాతాదారుడు మరణించిన సందర్భాల్లోనే మొదటి ఖాతాదారుడు ఆపరేట్ చేయడానికి అవకాశం వస్తుంది. 
    జాయింట్లీ: ఏ లావాదేవీ అయినా ఈ ఖాతాలో ఇద్దరు ఖాతాదారుల సమ్మతి ఉండాలి. ఇద్దరిలో ఒకరు మరణిస్తే రెండో వారు ఖాతా కొనసాగించడానికి అవకాశం ఉండదు. నగదు నిల్వలు ఉంటే మిగిలిన ఖాతాదారుడికి చెల్లించేస్తారు.

    జాయింట్లీ ఆర్ సర్వైవర్

    ఇందులో ఇద్దరు ఖాతాదారులు కలసి ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఒకరు మరణిస్తే రెండో వ్యక్తి తన పేరు మీదకు మార్చుకోవచ్చు. జాయింట్ అకౌంట్లలో ఉమ్మడి ఖాతాదారుల్లో ఒకరిని తొలగించడం, మరొకరిని యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. కాకపోతే అందుకు ఉమ్మడి ఖాతాదారులు అంగీకరించాలి.

    మైనర్ ఖాతాలు

    బ్యాంకుల్లో మైనర్ల పేరిట కూడా పలు రకాల ఖాతాలు నిర్వహించుకోవచ్చు. పదేళ్లు నిండే వరకు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు ఖాతా ఆపరేట్ చేయడానికి అనుమతి ఉంటుంది. పదేళ్లు దాటిన వారు స్వతంత్రంగా ఖాతా నిర్వహించుకోవచ్చు. కానీ లావాదేవీల విషయంలో పరిమితులు ఉన్నాయి. 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ ఖాతాను తాను కొనసాగిస్తానని మైనారిటీ తీరిన వ్యక్తి స్పష్టం చేసే వరకూ అందులో లావాదేవీలను అనుమతించరు.

    సీనియర్ సిటిజన్స్ అకౌంట్స్

    సేవింగ్స్, ఇతర ఖాతాల నిబంధనలు వృద్ధులకు కూడా సమానమే. కాకపోతే డిపాజిట్లపై వీరికి 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు అదనంగా వడ్డీ చెల్లిస్తున్నాయి బ్యాంకులు. దీనికి తోడు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం తాజాగా బ్యాంకుల్లోనూ ఓపెన్ చేసుకునేందుకు అనుమతించింది.

    సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (పెద్దల పొదుపు పథకం)

    ఇది డిపాజిట్ పథకం. ఇప్పటి వరకు పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంది. 2016-17 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈ సదుపాయాన్ని బ్యాంకులకు కూడా విస్తరించారు. ఈ పథకం కింద డిపాజిట్ పై 8.6శాతం వడ్డీని ప్రతి మూడు నెలలకు చెల్లిస్తారు. దీనికి ఆదాయపన్ను పూర్తిగా మినహాయింపు ఉంది. 60 ఏళ్లు నిండిన వారు అర్హులు. ముందస్తు పదవీ విరమణ చేస్తే 55 ఏళ్లకు కూడా ఇందులో చేరవచ్చు. జీవిత భాగస్వామితో కలసి ప్రారంభించవచ్చు. కాకపోతే మొదటి ఖాతాదారుడు సీనియర్ సిటిజన్ అయి ఉంటే చాలు. కనీసం వెయ్యి రూపాయలు గరిష్ఠం 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం, ఎన్ఆర్ఐలకు ఈ పథకంలో చేరేందుకు అవకాశం లేదు. పథకం గడువు ఐదేళ్లు. తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు.

    రికరింగ్ డిపాజిట్

    నెలనెలా క్రమం తప్పకుండా కనీస మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ దానిపై వడ్డీ గడించే ఖాతా ఇది. అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు అందిస్తున్నాయి. పోస్టాఫీసు కంటే బ్యాంకుల్లో ఆర్డీ ఖాతాలే అదనపు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. 100 రూపాయల నుంచి కూడా నెల నెలా ఆర్డీలో పొదుపు చేసుకోవచ్చు. కనీస మొత్తం అనేది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు గడువు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీయే ఆర్డీకి కూడా వర్తిస్తుంది. ఐదేళ్లకు ఆర్డీ ఓపెన్ చేస్తే డిపాజిట్లపై ఐదేళ్ల కాలానికి బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటే ఆర్డీ ఖాతాకు కూడా అమలవుతుంది. అధిక శాతం బ్యాంకులు మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి (క్వార్టర్లీ కాంపౌండెడ్) అసలుకు కలుపుతున్నాయి. సీనియర్ సిటిజన్లు అరశాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. 
    గడవుకు ముందుగా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించినా... కొంత మొత్తాన్ని కోత కోసుకుంటాయి బ్యాంకులు. అయితే, కొన్ని బ్యాంకులు ఆర్డీ ఖాతాలో జమైన మొత్తంపై ఏడాది తర్వాత నుంచి ఓడీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఒక ఏడాదిలో 24 వేలు జమ అయితే, దానిపై 80 నుంచి 90 శాతం అంటే సుమారు 20వేల రూపాయలను అత్యవసరాలలో డ్రా చేసుకోవచ్చు. దీన్ని తిరిగి చెల్లించాలి. వడ్డీ రేటు డిపాజిట్ రేటుపై అదనంగా ఒకటి నుంచి రెండు శాతం ఉంటుంది. వ్యక్తులు, మైనర్ల పేరిట ఆర్డీ ఖాతాలు తెరచుకోవచ్చు. ప్రవాస భారతీయులు కూడా వీటిని తెరవచ్చు. కొన్ని బ్యాంకులు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ను అమలు చేస్తుండగా... కొన్ని టీడీఎస్ నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. అంటే బ్యాంకులు వడ్డీలోంచి టీడీఎస్ ను మినహాయించవు. వ్యక్తులు వారి వారి ఆదాయంలో దీన్ని చూపించి పన్ను వర్తించే ఆదాయం ఉంటే కట్టాల్సి ఉంటుంది.

    ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్

    పేరులో ఉన్నట్టే సాధారణ ఆర్డీ ఖాతాకు అదనపు సౌకర్యాలతో కూడినదే ఫ్లెక్సీ ఆర్డీ ఖాతా. ఉదాహరణకు ఓ వెయ్యి రూపాయల మొత్తంతో పదేళ్ల కాలానికి ఫ్లెక్సీ ఆర్డీ ఓపెన్ చేస్తే నెలనెలా నిర్ణీత తేదీలోపే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. ఎప్పుడైనా అదనంగా మీ దగ్గర నగదు ఉన్నా... బోనస్ వచ్చినా ఆ మొత్తాన్ని ఫ్లెక్సీ ఆర్డీలో జమ చేసుకోవచ్చు. జమ చేసే రోజున ఉన్న వడ్డీ రేటు ఆ మొత్తానికి అమలవుతుంది. అసలు వెయ్యి రూపాయలకు వడ్డీ రేటు మాత్రం ఖాతా తెరచిన రోజు ఉన్నరేటే అమలవుతుంది. కొన్ని బ్యాంకులు గడువుకు ముందే ఫ్లెక్సీ ఆర్డీ ఖాతాలను క్లోజ్ చేసినా పెనాల్టీ విధించడం లేదు. పోటీకొద్దీ బ్యాంకులు ఇలా కొన్ని ఆఫర్లు ఇస్తున్నాయి.

    ఒకటి లేదా రెండు

    సాధారణంగా రెండు బ్యాంకు ఖాతాలకు మించి ఉంటే ఉపయోగం లేదని నిపుణులు చెబుతుంటారు. ఖాతాలు ఎక్కువైనకొద్దీ వాటి లావాదేవీలను పరిశీలించుకునే సమయం ఉండదు. అన్నింటికీ డెబిట్ కార్డులు, వాటిపై వార్షిక చార్జీల భారం ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డులు, యూజర్ నేమ్స్ ఇవన్నీ గుర్తించుకోవడం కూడా తలనొప్పే. జీరో బ్యాలన్స్ అయితే ఫర్వాలేదు, అలా కాకుండా అన్నీ మినిమమ్ బ్యాలన్స్ ఉంచాల్సిన ఖాతాలు అయితే వడ్డీ దండగే కదా. దీనికంటే వేతనానికి ఒకటి. నగదు చెల్లింపులన్నింటికీ ఒక ఖాతా ఉండడం సౌకర్యమని నిపుణుల సూచన. శాలరీ పడిన వెంటనే ఆ మొత్తాన్ని వేరే ఖాతాకు మార్చి ఖర్చులన్నీ దాన్నుంచి చేయడం వల్ల లావాదేవీలపై స్పష్టత ఉంటుంది. ఆదాయపన్ను శాఖ కళ్లు గప్పేందుకు చాలా ఖాతాలు నిర్వహించడం ప్రస్తుత రోజుల్లో తెలివైన నిర్ణయం కాదు. ఎందుకంటే అన్నిబ్యాంకులు ఖాతాదారుల నుంచి పాన్ నంబర్ తీసుకుంటున్నాయి. ఒక పాన్ నంబర్ తో ఎక్కడ ఏమున్నా ఐటీ వాళ్లు సులువుగా తెలుసుకోగలరు.