Wednesday 5 April 2017

వేప...దాని ఉపయోగాలు...!





    తెలుగువారి ఉగాది వచ్చిందంటే... వేపపువ్వుతో చేసిన పచ్చడి తినందే ఆ పండుగ అసంపూర్ణమే! ఉగాది సందర్భంలో వచ్చే వేపపూలని తినేందుకు ప్రోత్సహించడమే ఈ ఆచారం వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ వేపపచ్చడి ఎండాకాలంలో రాబోయే అంటురోగాలను శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. అయితే వేపతో మన అనుబంధం కేవలం ఉగాదితో తీరిపోయేది కాదు. వేపకి ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి!

    - వేపని మనం చెట్టుగా కాకుండా దేవతగా భావిస్తూ ఉంటాము. ఆ దేవత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతాము. అందుకే ఉగాది వంటి సందర్భాలలోనే కాకుండా గ్రామదేవతల జాతర్లలో కూడా వేపమండలు తప్పనిసరిగా పూజలో వినియోగిస్తారు.

    - వేపచెట్టు నుంచి వీచేగాలి, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రపరుస్తుందని పెద్దలు చెబుతారు.
    అందుకే అవధూతలు సైతం వేపచెట్లు ఉండే ప్రాంతంలో తిరిగేందుకు ఇష్టపడతారట. వేపచెట్టు కింద నిద్రించేవారు దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆయుర్వేదం చెబుతోంది.

    - వేప ఆకు, పూలు, బెరడు, కాయలు... ఇలా వేపచెట్టులోని అణువణువూ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చరకసంహిత వేపను సర్వరోగనివారిణిగా పేర్కొంటోంది. వేపతో నింబాదితైలం లాంటి అనేక లైపనాలు, తైలాలు, చూర్ణాలను తయారుచేస్తారు.

    - రోజూ క్రమం తప్పకుండా వేపచిగుళ్లని తింటూ ఉంటే షుగర్ వ్యాధి దరిచేరదు.

    - వేపచిగుళ్లని తినడం వల్ల పేగులలో ఉన్న హానికారక సూక్ష్మజీవులు, నులి పురుగులు కూడా చచ్చిపోతాయి.

    - వేపపుళ్లలతో పళ్లు తోముకుంటే పళ్లు, చిగుళ్లు దృఢంగా ఉండటమే కాకుండా... పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వెంట రక్తం కారడం వంటి సమస్యలు కూడా దరిచేరవు.

    - వేపలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకనే చర్మానికి వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. వేపాకులను కాచిన నీటితో కానీ వేపనూనెతో తయారుచేసిన సబ్బులని కానీ రుద్దుకుంటే చర్మవ్యాధులు తగ్గుముఖం పడతాయి, శరీరం దుర్గంధాన్ని నివారిస్తుంది.

    - వేపలో యాంటీవైరల్ సుగుణాలు ఉన్నాయి. అందుకే పొంగు, మశూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు... రోగులను వేపమండల మీద పడుకోపెట్టేవారు.

    - వేపాకుల గుజ్జుని కనుక తలకి పట్టిస్తే చుండ్రు, పేలులాంటి జుట్టుకి సంబంధించిన సమస్యలు మాయమైపోతాయి.

    - వైద్యుడి సూచనల ప్రకారం వేప చూర్ణాన్ని తీసుకుంటే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు, అతిమూత్రం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

    - నేతిలో కాచిన వేపాకుని కానీ వేప పండ్లు లేదా ఆకుల గుజ్జుని కానీ మొటిమలు, పుండ్లు మీద రాస్తే ఒకటి రెండు రోజులలోనే ఫలితం కనిపిస్తుంది.

    - వేప పండ్లు, విత్తనాల నుంచి తీసిన నూనె అద్భుతమైన క్రిమిసంహారినిగా పనిచేస్తుంది. ఒకరకంగా ప్రకృతి సిద్ధమైన pesticide, insecticideలలో వేపదే ప్రథమ స్థానం.

    - వేప పూతని ఉగాది పచ్చడిలో వాడటం మనకి తెలిసిందే. దీనిని నింబకుసుమభక్షణం అంటారు. వేపపువ్వు, వేపకాయలు, లేత వేప చిగుళ్లని ఉపయోగించి వంట చేయడం కూడా కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తుంది.

    No comments:

    Post a Comment